Delhi CM Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ స్కామ్‌ కేసులో జైరుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈకేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌కు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్ బెయిల్‌కు అర్హుడేనంటూ తీర్పు వెల్లడించింది. దీంతో జూన్ 26న అరెస్టైన ఢిల్లీ సీఎం శుక్రవారం విడుదలయ్యారు. 



జైలు నుంచి వచ్చిన కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జైలు వెలుపల గుమిగూడిన కార్యకర్తలు, మద్దతుదారులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..."ఎవరి ఆశీస్సులతో ఇక్కడ నిలుచున్నానో వారికి , ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లక్షలాది మంది ప్రజలకు, ఈ భారీ వర్షాల టైంలో కూడా ఇక్కడికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా విడుదల కోసం ప్రార్థించిన ప్రజలకు ధన్యవాదాలు." అన్నారు.






ఢిల్లీ సిఎం ఇంకా మాట్లాడుతూ... "నా జీవితం దేశానికి అంకితం, నా జీవితంలో ప్రతి క్షణం, ప్రతి రక్తపు చుక్క దేశానికి అంకితం, నేను జీవితంలో చాలా పోరాటాలు చూశాను, చాలా కష్టాలను ఎదుర్కొన్నాను, కానీ నేను నిజాయితీగా ఉన్నందున దేవుడు అడుగడుగునా మద్దతు ఇస్తున్నాడు."






"నన్ను జైలులో పెట్టారు, కేజ్రీవాల్‌ను కటకటాల వెనక్కి నెట్టడం వల్ల అతని మనోధైర్యం దెబ్బతింటుందని వారు భావించారు. ఈ రోజు, నేను జైలు నుంచి బయటకు వచ్చాను, నా మనోబలం 100 రెట్లు పెరిగిందని చెప్పాలనుకుంటున్నాను, నా బలం 100 రెట్లు పెరిగింది" అని వ్యాఖ్యానించారు.



“నా విడుదల కోసం ప్రార్థించిన దేశప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశంలోని కొందరు దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని బలహీనపరచాలని, దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, నేడు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని, ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సింది నేను అవినీతికి పాల్పడినందుకు కాదు, అలాంటి దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడడమే నా తప్పు అని కేజ్రీవాల్ అన్నారు.


అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి చంద్‌గిరామ్ అఖారా నుంచి తన నివాసం వరకు రోడ్‌షో నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్ విడుదలకు ముందు ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ సీఎం జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు స్వీట్లు పంచుకున్నారు.