Arvind Kejriwal Resigned: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన వెంట ఆప్ శాసనాసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిషీ, ఇతర మంత్రులు, ఆప్ నేతలు ఉన్నారు. ఆప్ ఎల్పీగా ఆతిషీని ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ ఎల్జీకి తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక.. త్వరలోనే ఢిల్లీ నూతన సీఎంగా ఆతిషీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయతీపరుడినని సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని చెప్పారు.








ఎల్పీ నేతగా ఆతిషీ


సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన క్రమంలో మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో ఆప్ ఎల్పీ నేతగా మంత్రి ఆతిషీని ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు.  కొత్త సీఎం ఎంపికపై సుదీర్ఘ చర్చల అనంతరం ఆతిషీని ఎన్నుకున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే ఆతిషీ (Atishi) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే ఛాన్స్ లేనట్లు సమాచారం. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నవంబర్‌లోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


నూతన సీఎం ఆతిషీ నేపథ్యం


అతిషీ మర్లోవా సింగ్.. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో.. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలుకు వెళ్లడంతో ఆతిషీనే యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ఆమె వెనక్కు తగ్గకుండా.. తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ పాలన సాగించారు. అతిషీ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు. ఆమె  బాల్యం, చదువు అంతా  ఢిల్లీలోనే సాగింది. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో సీటు సంపాదించిన ఆమె.. మొత్తం రెండు పీజీలు చేశారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. ఏడేళ్ల పాటు మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో.. ఆర్గానిక్ ఫామింగ్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేశారు. 


ఆప్ ఆవిర్భావం నుంచీ ఆతిషీ కీలకంగా వ్యవహరించారు. మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యురాలిగా, అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో గౌతం గంభీర్‌పై పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


Also Read: Supreme Court: 'బుల్డోజర్ న్యాయం'పై సుప్రీంకోర్టు కీలక తీర్పు - అప్పటివరకూ కొంపలేం మునిగిపోవంటూ వ్యాఖ్యలు