Nitin Gadkari On Parking : కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకొస్తుంది. పార్కింగ్ సమస్యను అధిగమించడానికి ఓ చట్టం తీసుకురాబోతుంది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలను తీసి కేంద్ర ప్రభుత్వానికి షేర్ చేసతే వారికి రూ.500 అందజేసేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు పాల్పడిన వ్యక్తికి రూ.1,000 జరిమానా విధిస్తామన్నారు. ఆ మొత్తం నుంచి రూ.500 ఫొటో పంపిన వ్యక్తికి ఇస్తామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిల్లీలోని ఓ హోటల్ లో జరిగిన ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ సమ్మిట్ 2022 అనే కార్యక్రమంలో పాల్గొన్న వారితో నవ్వుతూ చెప్పారు. 


చట్టబద్ధత ఉంటుందా? 


కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ ఉంటుందా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియదు. పట్టణాలు, నగరాల్లో కార్ల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా రాంగ్ పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారిందని ఈ వ్యాఖ్య చేశారు నితిన్ గడ్కరీ. ఒక కుటుంబంలోని ప్రతి సభ్యునికీ కార్లు ఉంటున్నాయి. కానీ ఎవరూ పార్కింగ్ స్థలాలను నిర్మించడంలేదు. ఉదాహరణకు దిల్లీలో విశాలమైన రోడ్లను పార్కింగ్ స్థలాలుగా పరిగణిస్తున్నారు అని గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లోని తన ఇంట్లో 12 కార్ల పార్కింగ్ స్థలం ఉందని, తాను రోడ్డుపై అస్సలు పార్క్ చేయనని పేర్కొన్నారు. సమ్మిట్‌లో తన చిరునామాకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేశారు.


ఎలక్ట్రిక్ వాహనాలు అత్యవసరం 


ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే ప్రజా రవాణా దేశానికి అత్యవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్‌లో పారిశుద్ధ్య కార్మికులకు కూడా కార్లు ఉంటాయన్నారు. త్వరలో భారతదేశంలో కూడా ఆ పరిస్థితిని వస్తుందని, అందరూ కార్లు కొంటున్నారన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కార్ల సంఖ్య బాగా పడిపోయిన మళ్లీ కార్ల అమ్మకాలు ఇటీవల పెరిగాయన్నారు. దేశంలోని డీలర్‌లకు ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మే 2022లో రెండు రెట్లు పెరిగాయన్నారు. 2021 మే నెలతో పోలీస్తే కార్ల అమ్మకాలు పెరిగాయన్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) ప్రకారం ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు మే 2022లో 2.5 లక్షల యూనిట్లకు పెరిగాయని, గత ఏడాది మేలో 1 లక్ష కంటే తక్కువ యూనిట్లు విక్రయించారన్నారు. వీటిలో ద్విచక్ర మూడు చక్రాల వాహనాలు మినహా కార్లు ఇతర వాహనాలు ఉన్నాయని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల మొత్తం విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో 5 లక్షల కంటే తక్కువగా ఉండగా, ఈ ఏడాది మేలో 15 లక్షల యూనిట్లకు పైగా పెరిగాయి.