Delhi Rains: 


రికార్డు స్థాయి వర్షపాతం 


ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరి కొన్ని రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ (IMD) వెల్లడించింది. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. ఫలితంగా...ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. గత 24 గంటల్లోనే ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982లో జులైలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాగా..ఆ తరవాత ఇదే రికార్డు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కురిసిన వానలకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంట్లో వానలకు తడిసిపోయిన పైకప్పు కుప్పకూలింది. సీలింగ్ ఫ్యాన్‌ పడడం వల్ల ఓ 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. 










అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం..


అటు రాజస్థాన్‌లోనూ (Rajastan Rains) వానల ధాటికి గత 24 గంటల్లోనే నలుగురు చనిపోయారు. రాజస్థాన్‌లో దాదాపు 9 జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశముందని IMD అంచనా వేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ వానలు దంచికొడుతున్నాయి. అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) వరుసగా మూడో రోజు కూడా రద్దైంది. పలు చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. శ్రీనగర్ జమ్ము హైవేలో దాదాపు 3 వేల వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. కేరళ, కర్ణాటకలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. కేరళలోని కొజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌లో ఎల్లో అలెర్ట్ చేశారు IMD అధికారులు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 7 ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. షిమ్లా, సిర్మౌర్, లహౌల్, స్పితి, చంబా, సోలాన్ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. హరియాణా, పంజాబ్‌లోనూ ప్రజలు వర్షాల ధాటికి ఇబ్బంది పడుతున్నారు. ఛండీగఢ్‌లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరదలు ముంచెత్తక ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం అధికారులందరికీ సండే ఆఫ్‌ని క్యాన్సిల్ చేసింది.