Delhi Red Fort Blast News | ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (నవంబర్ 10)న జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు సంభవించిన ఘటనలో పది మంది చనిపోయారు. దాంతో ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతా సంస్థలు పూర్తిగా అప్రమత్తమై తనిఖీలు చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే ఢిల్లీ పోలీసులు, స్పెషల్ సెల్, ఎన్ఎస్జీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు పహర్‌గంజ్, దరియగంజ్, కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని చిన్న, పెద్ద హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలో పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. పేలుడుకు ముందు గత 48 గంటల్లో గదులను బుక్ చేసుకున్న వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రతి హోటల్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి CCTV ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీసులు ఇంకా వారి గుర్తింపు లేదా అరెస్టును అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆ కారును అమ్మిన పుల్వామాకు చెందిన తారిక్
ఎర్రకోట సమీపంలో పేలుడులో ఉపయోగించిన i-20 కారును పుల్వామా నివాసి తారిక్ కు అమ్మారు. కారును వివరాలు చెక్ చేస్తే ఫరీదాబాద్ ఆటో కంపెనీ పేరుతో ఉంది. ఈ కంపెనీ ఫరీదాబాద్ లోని సెక్టార్ 37లో ఉంది. ఈ కంపెనీ ఢిల్లీ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్ లో ఉంది. ఈ కంపెనీ ఉపయోగించిన కార్ల కొనుగోలు, అమ్మకాలు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, NIA బృందాలు కారు తారిక్ కు చేరిన విధానం, ఈ లావాదేవీకి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తున్నాయి.
UAPA కింద కేసు నమోదు
ఈ మొత్తం విషయంలో ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. పేలుడులో ఉపయోగించిన కారు సర్వీస్, యాజమానుల హిస్టరీ రెండింటిపై వివరాలు ఆరా తీస్తున్నారు. తారిక్, ఉమర్ ఢిల్లీకి ఎప్పుడు వచ్చారు. పేలుడు జరిగిన రోజు వారు ఎక్కడ ఉన్నారు లాంటి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.