Deepfake Viral Videos:
డీప్‌ఫేక్ టెక్నాలజీపై వ్యాఖ్యలు..
డీప్‌ఫేక్ టెక్నాలజీపై (Deepfake Technology) ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనిపై ఇప్పటికే ChatGpt టీమ్‌తో మాట్లాడినట్టు వెల్లడించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీని (Deep Fake Technology) సీరియస్‌గా తీసుకోవాలని, అలాంటి వీడియోలను సర్క్యులేట్ చేసిన వాళ్లకి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు ప్రధాని. టెక్నాలజీని కాస్త బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
"ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇలాంటి సమయంలో టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదు. సరైన విధంగా దీన్ని వాడుకోవాలి. మీడియా కూడా ప్రజల్లో ఈ టెక్నాలజీపై అవగాహన కల్పించాలి"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ డీప్‌ఫేక్ వీడియో కూడా వైరల్ అయింది. ఆయన ఓ మహిళతో కలిసి గార్బా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఓ వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోపైనా స్పందించిన మోదీ "ఇది నిజమే అన్నట్టుగా ఉంది" అని అన్నారు. తాను ఎప్పుడూ గార్బా డ్యాన్స్ చేయలేదని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉన్న వ్యక్తిని కాస్త అటూ ఇటూ మార్చి వీడియో పోస్ట్ చేశారు. అచ్చం ప్రధాని మోదీ డ్యాన్స్ చేస్తున్నట్టుగానే కనిపించింది.
సంచలనమైన వీడియోలు..
సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్ (Rashmika Deepfake Video) అవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరవాత నటి కాజోల్ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బాధితులు ఎవరైనా సరే ముందుకొచ్చి కచ్చితంగా ఫిర్యాదు చేయాలని, IT రూల్స్ ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. సెలబ్రిటీస్‌ని టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు సృష్టిస్తున్నారు కొందరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. రష్మిక మందన్న వీడియోని కూడా బిహార్‌కి చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అందరికీ ఫార్వర్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఏ అకౌంట్‌లో నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయిందో విచారిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వీడియోలపై లీగల్‌గా ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి హెచ్చరించింది. ఇలాంటి కంటెంట్ ఉన్నట్టు గుర్తించిన 36 గంటల్లోగా దాన్ని తొలగించాలని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడి లేని ఏ కంటెంట్‌ని అయినా ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది. భారతీయుల డిజిటల్ స్పేస్‌ని సురక్షితంగా ఉంచడంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని తెలిపింది.
రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ తదితరులు స్పందిస్తూ రష్మికకు మద్దతుగా నిలిచారు. రష్మిక ఫేక్ వీడియో తర్వాత కత్రినా కైఫ్ తో పాటూ తాజాగా కాజోల్ డీప్ ఫేక్ వీడియో సైతం నెట్టింట వైరల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్, కన్నడ హీరో రక్షిత్ శెట్టి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. " ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కి లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందు అరికట్టాలి. రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలుగంటోంది" అని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు.
Also Read: మధ్యప్రదేశ్ పోలింగ్‌లో ఉద్రిక్తత, రాళ్లు రువ్వుకున్న రెండు గ్రూపులు - బీజేపీ నేతకు గాయాలు