Fair Delimitation meeting in Chennai | చెన్నై: నియోజకవర్గాల పునర్ విభజన అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు సమావేశం నిర్వహించి తీర్మానం చేయడం తెలిసిందే. మార్చిలో నిర్వహించిన ఈ ఫెయిర్ డీలిమిటేషన్ సమావేశంపై మెమోరాండం సమర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఇందుకోసం ప్రధాని మోదీని కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మార్చి 27వ తేదీన తాను రాసిన లేఖను స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల విపక్ష నేతలతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై చర్చించిన అంశాలను కేంద్రం దృష్టికి వెళ్లాలని తమిళనాడు సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. ఆ సమావేశానికి నేతృత్వం వహించిన డీఎంకే అధినేత స్టాలిన్ ప్రధాని మోదీకి ఇటీవల రాసిన లేఖను బహిర్గతం చేశారు.

 

వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మార్చి నెలలో జరిగిన ఫెయిర్ డీలిమిటేషన్ సమావేశంలో తీర్మానాలను వివరించేందుకు తమకు సమయం కోరుతూ ప్రధాని మోదీకి రాసిన లేఖను బయటపెట్టారు. కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి నష్టం జరగకకుండా నియోజకవర్గాల పునర్ విభజన ఉంటుందని చెబుతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని, విధివిధానాలు ఖరారు చేయకుండా అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇతర పార్టీల వాదనను కొట్టిపారేస్తున్నారు. వచ్చే డీలిమిటేషన్ సమావేశంలో హైదరాబాద్ లో జరగనుందని. రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు దక్షిణాది ఎంపీలు , స్టాలిన్ అందుకు అంగీకరించారని తెలిసిందే.

చెన్నై సమావేశంలో చేసిన తీర్మానాలు

- డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరగకూడదు.- అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సందేహాలు తీర్చిన తరువాతే డీలిమిటేషన్ చేపట్టాలి.- పార్లమెంట్ లో లోక్‌సభ, రాజ్యసభలోగానీ ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం తగ్గకూడదు. ఇప్పుడున్న తీరుగానే ఎంపీ సీట్లు ఉండాలి.- గతంలోనే దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో ఎక్కువ తీసుకుని, తక్కువ వెనక్కి ఇచ్చేవారు. ఇకనుంచి అలా జరగకూడదు.