భారత్‌లో తాజాగా 12,729 కరోనా కేసులను గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒకేరోజులో దేశంలో 221 మంది కరోనా సోకడం వల్ల మరణించినట్లుగా వివరించారు. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,333,754 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,59,873 కి ఎగబాకింది. 


ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1,48,922గా ఉందని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. యాక్టివ్ కేసులు గత 253 రోజులతో పోలిస్తే అతి తక్కువగా నమోదయ్యాయని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అన్ని కేసుల్లో ఒకశాతం కూడా ప్రస్తుత యాక్టివ్ కరోనా కేసులు లేవని వివరించారు. ప్రస్తుతం 0.43 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇది గతేడాది మార్చి నుంచి అతి తక్కువ అని పేర్కొన్నారు.










దాదాపు 6,70,847 కరోనా పరీక్షలు దేశ వ్యాప్తంగా నిర్వహించామని అందులో నుంచి 12,729 కేసులను గుర్తించినట్లుగా వివరించారు. దీంతో గురువారం నాటికి మొత్తం చేసిన కరోనా పరీక్షల సంఖ్య 613,017,614 అని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ వెల్లడించింది. గత 24 గంటల్లో 12,165 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 33,724,959 అని వెల్లడించారు.


వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇలా..


మరోవైపు వ్యాక్సినేషన్ కూడా దేశంలో శరవేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా 1,077,046,116 డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలకి అందించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నట్లుగా కరోనా బులెటిన్‌లో వివరించారు. తాజాగా అక్కడ 7 వేలకు పైచిలుకు కేసులను గుర్తించారు.