దేశంలో కరోనా కేసులకు సంబంధించి రోజువారీ హెల్త్ బులెటిన్‌ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసులు 30 వేల కన్నా దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 147 రోజుల్లో రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఇంత స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని పేర్కొంది.
ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కరోనా కేసులు 3,88,508 ఉన్నాయని వెల్లడించింది. 139 రోజుల తర్వాత కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు కనిష్ఠానికి చేరుకున్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.21 గా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా కేసుల్లో రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగిందని కరోనా బులెటిన్‌లో వివరించింది. గడిచిన ఒక రోజులో 41,511 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,11,80,968 మందికి చేరింది.
ఒక రోజులో 15,11,313 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 28,204 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 20 శాతం మేర తగ్గాయి. నిన్న 373 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.19 కోట్లకు చేరగా, కరోనా బారిన పడి 4.28 లక్షల మంది చనిపోయారు.
తెలంగాణలో ఇలా..
మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు ఆగస్టు 9న 453 నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారు 614 మంది ఉండగా.. చనిపోయిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణలో ఒకేరోజు 80,658 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నుంచే 453 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు తెలంగాణలో 8వేల 242 ఉన్నాయి.
ఏపీలో కేసులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఆగస్టు 9న 1,413 కొత్త కేసులు గుర్తించారు. మొత్తం 54,455 శాంపిల్స్ పరీక్షించారు. కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరి చొప్పున మరణించారు. కాగా ఏపీలో మొత్తం 1,795 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటిదాకా ఏపీలో మొత్తం 2,52,47,884 శాంపిల్స్ పరీక్షించినట్లుగా మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు.పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.