Aditya-L1 Solar Mission:



కౌంట్‌డౌన్..


శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించనున్న ఆదిత్య ఎల్ - 1 ప్రయోగాన్ని పురస్కరించుకొని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్., డాక్టర్ మోహన్లు ఆదిత్య ఎల్ - 1 ఉపగ్రహ నమూనాతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిత్య ఎల్ - 1 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్య ఎల్ 1 సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆదిత్య ఎల్-1 నమూనాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఇస్రో డైరెక్టర్లను ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రయాన్-3 సక్సెస్ తరవాత ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రయోగం Aditya L1. సెప్టెంబర్ 2 న ఉదయం 11.50 నిముషాలకు దీన్ని లాంఛ్ చేయనున్నారు. ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. సూర్యుడిపై అధ్యయనానికి భారత్ పంపిస్తున్న తొలి శాటిలైట్ ఇదే. 


ఈ ఆదిత్య ఎల్ - 1 శాటిలైట్ ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ - 1) వద్ద ఉంచి అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధన చేయనున్నారు. ఎల్ - 1 పాయింట్ వద్ద ఆదిత్య శాటిలైట్ ను  మోహరించడం ద్వారా నిరంతరాయంగా శాటిలైట్ సూర్యుడిపై పరిశోధన చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్‌ పాయింట్‌ - 1 ఉంటుంది.