Corona Cases Increasing In India : దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పెట్టింది. రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి నుంచి మరోసారి నమూనాలు సేకరించి కొత్త వేరియంట్ నిర్ధారణకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లకు పంపించారు. కొత్త కేసులు నమోదు తగ్గుముఖం పట్టడం, కొత్త వేరియంట్ ప్రభావం దేశంలో పెద్దగా కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మళ్లీ రెండు నెలలు తరువాత దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 157 మందికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్రం వెల్లడించింది. ఇవి భారీ కేసులు కానప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు కావడంతో కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.
కొనసాగుతున్న పరీక్షలు
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు రోజులకు మించి జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలు ఉండి, మందులు వాడుతున్నా తగ్గని వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పరీక్షలు నిర్వహించిన వారికి అవసరమైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేని వారిని ఇళ్ల వద్దే హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఏపీలోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆరోగ్యశాఖ అదికారులు చెబుతున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజలు సమూహాలకు దూరంగా ఉండడం, మాస్క్ ధరించడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.