Congress On ED Raids: ఛత్తీస్ గఢ్ లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు ఇతర ప్రాంతాలో సోదాలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు పగకు, వేధింపులకు నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విమర్శించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పుర్ లో ఫిబ్రవరి 24 - 26 వరకు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ముందు ఈడీ దాడులు జరగడాన్ని కక్షపూరిత చర్యలుగా జైరామ్ రమేష్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ కేవలం 112 దాడులు నిర్వహించగా.. బీజేపీ అధికారంలో ఉన్న 8 ఏళ్లలో ఏకంగా 3010 దాడులు జరిగాయని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తెలిపారు.
95 శాతం దాడులు ప్రతిపక్షాలపైనే
3 వేల పైచిలుకు ఈడీ దాడుల్లో 95 శాతానికి పైగా ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని పవన్ ఖేరా అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను ప్రశ్నించారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సమావేశాలు జరగబోతున్నందున ఛత్తీస్ గఢ్ లో ఈడీ దాడులు మొదలయ్యాయని అన్నారు. ఇప్పుడు ఈడీ అంటే ఎలిమినేటింగ్ డెమోక్రసీ అని ఆయన అభివర్ణించారు.
ఏ పార్టీపై ఎన్ని దాడులు జరిగాయంటే..
2014 నుండి ప్రతిపక్ష పార్టీలపై ఈడీ దాడులు జరిపిన గణాంకాలను కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. కాంగ్రెస్ నేతలపై 24, టీఎంసీ నేతలపై 19, ఎన్సీపీపై 11, శివసేనపై 8, డీఎంకే పై 6, ఆర్జేడీపై 5, పీడీపీపై 5, ఐఎన్ఎల్డీపై 3, వైఎస్సార్సీపీపై 2, సీపీఎంపై 2, నేషనల్ కాన్ఫరెన్స్ పై 2, పీడీపీపై 2, అన్నా డీఎంకేపై 1, ఎంఎన్ఎస్ పై 1, ఎస్బీఎస్పీపై 1 సారి చొప్పున దాడులు నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలు రామ్ గోపాల్ అగర్వాల్, దేవేంద్ర యాదవ్, గిరీష్ దేవాంగన్, ఆర్పీ సింగ్, వినోద్ తివారీ, సన్నీ అగర్వాల్ లపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు పవన్ ఖేరా వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని తెలిపారు.
"హిమంత బిస్వా శర్మ, సుబేందు అధికారిపై సమాధానం చెప్పండి"
ఈడీ రైడ్ ను ప్రశ్నిస్తూ హిమంత బిస్వా శర్మకు వ్యతిరేకంగా బీజేపీ చాలా పేపర్లను చూపించిందని, కానీ ఆయన క్లీన్ అండ్ క్లీన్ గా బయటకు వచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సుబేందు అధికారి, కర్ణాటకకు చెందిన బీఎస్ యడ్యూరప్ప, రెడ్డి బ్రదర్స్, నారాయణ్ రాణే, ముకుల్ రాయ్ వంటి పేర్లను కాంగ్రెస్ నాయకలు వెల్లడించారు.
"ప్రధాని మోదీకి ఈడీ ఆయుధంగా మారింది"
ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ప్రతిపక్షాలకు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయుధంగా మారిందని జైరాం రమేష్ అన్నారు. ఈడీ నిష్పక్షపాతంగా పని చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ చేసిన దాడుల్లో 95 శాతం ప్రతిపక్షాలపై చేశాయని తెలిపారు. కాంగ్రెస్ ప్లీనరీ మీటింగ్ కు ముందు ఈడీ దాడులు చేయడం ప్రధాని మోదీ పిరికితనానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.