Congress On Elections Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాహుల్ అన్నారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నానన్నారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 







పంజాబ్ లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ ను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. పంజాబ్ లో కేవలం 18 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం  అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్ లో కాంగ్రెస్ దిగ్గజాలు చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌, గోవాలో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. గోవాలోనూ కాంగ్రెస్ వెనుకబడింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఆశాజనకంగా వచ్చిన ఫలితాల్లో మాత్రమే విజయం రివర్స్ అయింది. గోవాలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ గా అవతరించింది. 






యూపీలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం 


యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అంతా తానై ప్రచారం చేశారు. అయినప్పటికీ గతంలో కంటే సుమారు 3 శాతం పార్టీ ఓటు షేరును కోల్పోయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా భారీగా ఓటు షేర్ కోల్పోయింది. 2017లో ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ ఓటు షేర్ 38.5 శాతంగా ఉంది. గోవాలోనూ గతంలో  కంటే 8 స్థానాల్లో కాంగ్రెస్ వెనుకబంది. అలాగే మణిపూర్‌ లోనూ  కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 2017లో ఇక్కడ 35.1 శాతం ఓటు షేర్ రాగా, తాజాగా 17 శాతానికే పరిమితం అయ్యేలా ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును తాను సవినయంగా అంగీకరిస్తున్నట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, ఇంకా కొనసాగిస్తానని ఆమె తెలిపారు.