Rahul Gandhi:
గెలిచేది మేమే: రాహుల్ గాంధీ
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీయే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్‌లలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ షాక్‌కి గురవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికలు తమకు ఓ పాఠం నేర్పించాయని, అందుకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందన్న విషయం బీజేపీకి కూడా తెలుసని, ఆ పార్టీలో ఈ చర్చ జరుగుతోందని అన్నారు రాహుల్. ఎన్నికలను తప్పుదోవ పట్టించి గెలవాలనుకున్న బీజేపీ వ్యూహం కర్ణాటకలో పని చేయలేదని స్పష్టం చేశారు. కులగణననీ బీజేపీ పట్టించుకోవడం లేదని, ఇది ప్రజలకు అవసరం అని తెలిసినా ఆ చర్చే చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
"త్వరలోనే జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మేం కచ్చితంగా గెలుస్తాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ విజయం మాదే. రాజస్థాన్‌లోనూ మాకే ఎక్కువగా విజయావకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఆ పాచికలు కర్ణాటకలో పారలేదు. అందుకే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కులగణన పైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ అవసరం అని తెలిసినా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడు మేం చర్చ తీసుకొచ్చినా ఆ చర్చను డైవర్ట్ చేస్తున్నారు. మీడియానీ బీజేపీ కంట్రోల్ చేస్తోంది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
డైవర్షన్ పాలిటిక్స్..
రాజస్థాన్‌లో సంక్షేమ పథకాల గురించీ ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఒకేదేశం, ఒకే ఎన్నికపైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇది కూడా ప్రజల్ని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే అని తేల్చి చెప్పారు. నిరుద్యోగం, అసమానతలు, వెకనబడి వర్గాల సమస్యలు, ధరల పెరుగుదల ఇలాంటి సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. అందుకే తమ ఎంపీలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తోందని, ఇండియా పేరు మార్చడం లాంటి ట్రిక్‌లతో డైవర్ట్ చేస్తోందని ఫైర్ అయ్యారు.