Confirmed Rail Tickets: 



2027 నాటికి చాలా మార్పులు.. 


రైల్వే వ్యవస్థలో (Indian Railways News) ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. అయినా డిమాండ్‌కి, అందుబాటులో ఉన్న రైళ్లకు పొంతన కుదరడం లేదు. పండగ వేళల్లో రైళ్లు తీవ్రమైన రద్దీతో నిండిపోతున్నాయి. ఇటీవల దీపావళి పండగకి రైళ్లు (Rush in Trains) కిటకిటలాడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టికెట్‌లు బుక్ చేసుకున్నప్పటికీ చాలా వరకూ కన్‌ఫమ్‌ (Confirmed Rail Tickets) కాలేదు. ఫలితంగా...ఇలా రైళ్లలోనూ ఫుట్‌బోర్డింగ్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు చాలా మంది. బిహార్‌లో ఓ 40 ఏళ్ల వ్యక్తి రైలు ఎక్కుతూ కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరింత సంచలనమైంది. ఈ సమస్యపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2027 నాటికి రైళ్ల సంఖ్య భారీగా పెంచాలని యోచిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ అనేదే లేకుండా అందరికీ టికెట్‌లు కన్‌ఫమ్ అయ్యేలా రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఏటా రైల్వే ట్రాక్‌లను విస్తరిస్తూ పోవాలని ప్లాన్ చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...ఏటా 4-5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లను ఏర్పాటు చేయనుంది. 


నెట్‌వర్క్ విస్తరణ..


ప్రస్తుతానికి రోజూ దేశవ్యాప్తంగా 10,748 రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఈ సంఖ్యని 13 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే మూడు నాలుగేళ్లలో కనీసం 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఏటా రైళ్లలో 800 కోట్ల మంది ప్యాసింజర్స్ ప్రయాణిస్తున్నారు. ఈ కెపాసిటీని 1000 కోట్లకు పెంచాలనేదే రైల్వే లక్ష్యం. రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు ట్రావెలింగ్ టైమ్‌నీ తగ్గించాలని రైల్వే భావిస్తోంది. అందుకే ఎక్కువ సంఖ్యలో ట్రాక్‌లు ఏర్పాటు చేయాలనుకుంటోంది. రైళ్ల వేగాన్నీ పెంచనుంది. స్పీడ్‌ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా రైళ్లను డిజైన్ చేయనుంది. రైళ్ల వేగం పెంచడం ద్వారా ఢిల్లీ నుంచి కోల్‌కత్తా మధ్య ట్రావెలింగ్ టైమ్‌ని కనీసం 2 గంటల 20 నిముషాల మేర తగ్గించవచ్చని అంచనా. ఇందుకో Push Pull టెక్నాలజీని విస్తృతంగా వినియోగించనుంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీతో 225 రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుత రైళ్లతో పోల్చుకుంటే వందేభారత్ (Vande Bharat Trains) పుష్‌పుల్ కెపాసిటీ ఎక్కువ. 


కశ్మీర్‌లోనూ త్వరలోనే వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains in Kashmir) అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయం వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము -శ్రీనగర్‌ లైన్‌లో వందేభారత్‌ ట్రైన్‌ సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెమీ హై స్పీడ్‌ ట్రైన్స్‌ని నడిపే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి రైల్వే లైన్‌ కన్‌ఫమ్ కాగానే వెంటనే ఈ ట్రైన్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌నీ అందుబాటులోకి తీసుకురానుంది. 


Also Read: వాళ్లను బయటకు తీయాలంటే మరో 2-3 రోజులు పడుతుండొచ్చు - ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్రమంత్రి