Election Manifestos By Political Parties: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు (Political Parties) ప్రకటించే మేనిఫెస్టోపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఎన్నికల చట్టాల (Election Laws) ప్రకారం మేనిఫెస్టోలోని పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ మేనిఫెస్టో ప్రకటించడం అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్ (Justice Surya Kant), జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌ (Justice VK Viswanathan)లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ వాదన విచిత్రంగా ఉందని అభిప్రాయపడింది. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. 


కర్ణాటక హైకోర్టులో పిటిషన్
కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో అనేక హామీలు ప్రకటించింది. దీనిపై శశాకం జె శ్రీధర అనే వ్యక్తి స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అవినీతి కిందకే వస్తాయని పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జమీర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ శశాంక శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు.


రాజకీయ పార్టీలు అధికారం చేపట్టేందుకు అలవిగాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. వీటి కారణంగా ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇష్టారీతిన మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కూడా అవినీతికి కిందకే వస్తాయని, వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని  కోరారు.


తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని తెలిపింది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శశాంక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని ప్రశ్నించింది. మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.