ASTRA Missile: లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ దేశీయంగా అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. గోవా తీరం గగనతలంలో ఈ అస్త్ర క్షిపణిని పరీక్షించింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(LCA) తేజస్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, విమానం నుంచి దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో క్షిపణి విడుదల విజయవంతం అయింది.
ఈ దేశీయ క్షిపణి పరీక్షా ప్రయోగాన్ని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ADA), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) టెస్ట్ డైరెక్టర్, శాస్త్రవేత్తలతో పాటు సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్(CEMILAC), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ అధికారులు పర్యవేక్షించారు. తేజస్ యుద్ధ విమానం అస్త్ర క్షిపణిని ప్రయోగించే సమయంలో తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పర్యవేక్షించారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ అస్త్ర క్షిపణి.. సూపర్ సోనిక్ వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి తయారు చేసిన అత్యాధునిక బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. ఈ అత్యాధునిక అస్త్ర క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ(DRDL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్(RCI), DRDO సహా ఇతర ప్రయోగశాలలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల నుంచి స్వదేశీ అస్త్ర బీవీఆర్ క్షిపణి ప్రయోగం.. ప్రధాని మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ బారత్ కార్యక్రమంలో భాగమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అస్త్ర క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థలను, పరీక్షించిన అన్ని విభాగాల వారిని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.