బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించింది కోల్ ఇండియా. ఒక్కొక్క కార్మికుడికి 85వేల రూపాయల చొప్పున బోనస్‌ అందించాలని నిర్ణయించింది.  కోల్‌ ఇండియా  పరిధిలోని సుమారు మూడున్నర లక్షల మంది కార్మికులకు ఈ బోనస్‌ అందనుంది. కోల్ ఇండియా కార్యాలయంలో యాజమాన్యం... కార్మిక సంఘాలతో సమావేశం  నిర్వహించింది. ఈ సమావేశంలో 2022-2023లో ఇచ్చే దీపావళి బోనస్‌పై నిర్ణయం తీసుకుంది. ఈసారి లక్ష రూపాయల బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.  అయితే... 85వేల రూపాయల బోనస్‌ చెల్లింపునకు ఏకాభిప్రాయం కుదిరింది. సిసిఎల్‌కు చెందిన 33 వేల మంది, బిసిసిఎల్‌కు చెందిన 36 వేల మంది కార్మికులు, కోల్  ఇండియా అసోసియేట్ కంపెనీలకు చెందిన మొత్తం 2లక్షల 23వేల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. ఒక్కో కార్మికుడికి 85వేల రూపాయలు దీపావళి బోనస్‌గా  లభించనుంది.


బొగ్గు గని కార్మికులకు ఏటా దీపావళి బోనస్‌ ఇస్తారు. అయితే... గత ఏడాది కంటే ఈ దీపావళికి బోనస్‌ను కాస్త ఎక్కువగానే ప్రకటించింది కోల్‌ ఇండియా యాజమాన్యం.  గతేడాది బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌గా 76వేల 500 రూపాయలు చెల్లించగా... ఈసారి 8వేల 500 రూపాయలు పెంచి 85వేలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది  కోల్‌ ఇండియా యాజమాన్యం. సింగరేణి కార్మికులకు... ఈ బోనస్‌ డబ్బులు దీపావళికి వారం, పది రోజుల ముందు అకౌంట్లలో జమ చేస్తారు. మిగిలిన ప్రాంతాల వారికి మాత్రం  దసరా ముందే చెల్లించనుంది కోల్‌ ఇండియా యాజమాన్యం. 


2022-23 ఆర్థిక సంవత్సరం లాభాల ఆధారంగా బొగ్గు కార్మికులకు బోనస్‌ ప్రకటిస్తారు. కోల్ ఇండియా 2022-23లో 28వేల 125 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే బీసీసీఎల్, సీసీఎల్, ఈసీఎల్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. దీంతో బోనస్‌ భారీగానే ప్రకటించారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా బోనస్‌ ఇచ్చేలా కృషిచేస్తామని తెలిపింది కోల్‌ ఇండియా యాజమాన్యం. కార్మిక సంఘాలు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఏ ప్రభుత్వ రంగంలోనూ చెల్లించని విధంగా... కోల్‌ ఇండియా పెద్ద మొత్తంలో బోనస్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.


2010 నుంచి ఇచ్చిన బోనస్‌ వివరాలు
2010 - 17,000
2011 - 21,000
2012 - 26,000
2013 - 31,500
2014 - 40,000
2015 - 48,500
2016 - 54,000
2017 - 57,000
2018 - 60,500
2019 - 64,700
2020 - 68,500
2021 - 72,500
2022- 76,500