న్యూఢిల్లీకి చెందిన శ్రుతి శర్మ UPSC సివిల్ సర్వీసెస్(Civils) పరీక్ష 2021లో టాపర్‌గా నిలిచారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో శ్రుతి తర్వాత కూడా ఇద్దరు మహిళలే రెండు మూడు ర్యాంకులు కైవశం చేసుకున్నారు.
శ్రుతి శర్మది వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్. దిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. అందుకే హిస్టరీనే ఆప్షనల్‌గా ఎంచుకని సివిల్స్ క్రాక్ చేశారు.
తాను ఎక్కడ తన ఆనందాలను వదులుకోలేదని... ప్లాన్డ్‌గా చదివానంటున్నారు శ్రుతి. సినిమాలు, సోషల్ మీడియాను వదల్లేదని అయితే ప్రతి దానికి లిమిట్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్టు పేర్కొన్నారు.
సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తుందని అనుకున్నానని.. ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఊహించలేదంటున్నారు శ్రుతి శర్మ. ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయానంటున్నారు.
డిగ్రీ పూర్తైన తర్వాత శ్రుతి శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో సీటు సంపాదించారు. అక్కడే సివిల్స్ రాయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA)లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు కోచింగ్ తీసుకున్నారు. శర్మతోపాటు RCA నుంచి 23 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్‌లు కొట్టారు.
శ్రుతి శర్మ మొదటి ర్యాంక్ అయింతే రెండో, మూడో ర్యాంకులను అంకితా అగర్వాల్, గామిని సింగ్లా సాధించారు. ఐశ్వర్య వర్మ నాల్గో ర్యాంక్ సాధించారు. మొత్తం 685 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్‌లోని ఇతర శాఖలకు ఎంపికయ్యారు. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు UPSC నిర్వహించిన ఇంటర్వ్యూ రౌండ్‌లో మూడు రౌండ్‌లలో వారి పనితీరు ఆధారంగా టాపర్‌లను ఎంపిక చేశారు.
మొదటి నాలుగు ర్యాంకులు మహిళలకే రావడంతో అందర్నీ అభినందనలతో ముంచెత్తున్నారు. ఇలాంటి పరీక్షల్లో టాప్ ర్యాంకర్లు మహిళలే కావడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ట్విట్టర్‌లో #Future is female హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది.