Chirag Paswan Rejoins NDA: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నేతలు రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ క్రమంలో లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ మళ్లీ ఎన్డీఏలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమైన అనంతరం తాను తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే నేడు, రేపు ప్రతిపక్షాలు బెంగళూరులో కీలక భేటీ కాగా, మంగళవారం  38 పార్టీలు పాల్గొననున్న కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశానికి ఒక రోజు చిరాగ్ చేరికతో కీలక పరిణామం చోటుచేసుకుంది.






2020లో బిహార్‌లో రాజకీయాల పరిణామాలతో ఎన్డీఏ కూటమి నుంచి ఎల్ జే పీ వైదొలగింది. ఆ సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్న సీఎం నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ (జేడీయూ) కి వ్యతిరేకంగా పాశ్వాన్ కేంద్రంలో అధికార కూటమి ఎన్డీఏ నుంచి వైదొలిగారు.


లోక్ జనశక్తి పార్టీ అగ్రనేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంతో ఎల్‌జేపీలో చీలిక రావడం తెలిసిందే. చిరాగ్ పాశ్వాన్ మేనమామ పశుపతి కుమార్ పరాస్ తన వర్గీయులతో పార్టీని వీడారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రి అయ్యారు. అయితే చిరాగ్ పాశ్వాన్ తాను ప్రధాని నరేంద్ర మోదీకి హనుమంతుడు లాంటి సేవకుడ్ని అన్నారు. ప్రతి క్లిష్ట పరిస్థితిలో బీజేపీకి మద్దతుగా నిలిచానని గుర్తుచేసుకున్నారు. అయితే ప్రచారానికి తనకు ప్రధాని మోదీ ఫొటోలు అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన హృదయంలోనే ఉన్నారని.. తాను ఆయనకు హనుమాన్ లాంటి వాడినని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.


కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ తన మాజీ మిత్రులను కూటమిలో చేరాలని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో బిహార్‌లో తన పార్టీ లోక్‌సభ సీట్ల వాటాపై చర్చించేందుకు చిరాగ్ పాశ్వాన్ సోమవారం హోం మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానని భేటీ అనంతరం పావ్వాన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ గతంలో పాశ్వాన్‌తో రెండు సార్లు భేటీ కావడం తెలిసిందే. ఎల్జేపీ వర్గాలుగా చీలక ముందు 2019లో ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీతో సీట్ల ఒప్పందంలో భాగంగా రాజ్యసభ స్థానాన్ని సైతం పొందింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial