Opposition Meeting: బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో జరగనున్న విపక్షాల సమావేశంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు బసవరాజ్ బొమ్మై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రతిపక్షాల లక్ష్యమని ఆయన అన్నారు. కానీ అది ఎప్పటికి జరిగే పని కాదన్నారు.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలికలు, అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడం, పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్న సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు మెగా సమావేశం జరగనుంది. ఇందులో ప్రముఖ పార్టీలు కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎన్‌సీపీ 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు వేదిక కానుంది. ఈ సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆప్ నేత రాఘవ్ చద్దా తెలిపారు. గత ఆదివారం జరిగిన ఆప్ పీఏసీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.
రేపు ఎన్డీఏ పక్ష సమావేశం
విపక్షాల సమావేశం నేపథ్యంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. ఎన్‌డీఏ పక్ష మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఎన్‌డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేన పార్టీకి మాత్రమే బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. అధికార పార్టీలు ఎన్డీఏ సమావేశానికి దూరంగా ఉంటున్నాయి. బీజేపీతో పొత్తు కోసం యత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందలేదు.
అక్కడ చంపుకుంటూ.. ఇక్కడ కలుస్తున్నారు? : బీజేపీ రాహుల్ సిన్హా
విపక్షాల సమావేశంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు రాహుల్ సిన్హా సైతం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సీపీఐ (ఎం), టీఎంసీలు బెంగాల్‌లో ఒకరినొకరు చంపుకుంటున్నాయని, కానీ ప్రధాని మోడీని గద్దె దింపడానికి బెంగళూరులో ఏకమవుతున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలల్లో జరిగిన హింసను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అధికార టీఎంసీ, ప్రతిపక్ష సీపీఎంలు ఒకరినొకరు చంపుకుంటూ ప్రధాని మోదీని అధికారం నుంచి గద్దె దింపడానికి బెంగళూరులో ఏకమవుతున్నారని, ఈ డ్రామాలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.