Justice DY Chandrachud Recommends Justice Sanjiv Khanna: :భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్(Justice DY Chandrachud ) పదవీ కాలం మరికొద్దిరోజుల్లో ముగియనుంది. దీంతో తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of India )గా సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి చంద్రచూడ్‌ సిఫార్సు చేశారు.


జస్టిస్‌ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. అందుకే తదుపతి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna)ను సిఫార్స్‌ చేస్తూ కేంద్రానికి చంద్రచూడ్‌ లేఖ రాశారు. సీజేఐ చంద్రచూడ్ సిఫార్సును కేంద్రం ఆమోదిస్తే... జస్టిస్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ఎంత అంటే?


CJIగా ప్రమాణం చేస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా దాదాపు ఏడు నెలలు ఈ పదవిలో ఉంటారు. మే 13, 2025న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ చంద్రచూడ్ ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు పని చేస్తున్నారు. 


ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా?
జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 18 జనవరి 2019లో పదోన్నతి పొందారు. ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మే 14, 1960న జన్మించిన జస్టిస్ ఖన్నా 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులలో  పని చేశారు. ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా పని చేశారు. ప్రత్యక్ష పన్నులు, మధ్యవర్తిత్వం, బిజినెస్‌ లా, కంపెనీ లా, లాండ్‌ లా , మెడికల్ నెగ్లిజెన్సీ వంటి విభిన్న కేసుల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. 


ఆదాయపన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. 2004లో ఢిల్లీకి స్టాండింగ్ కౌన్సెల్ (సివిల్)గా నియమితులయ్యారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఢిల్లీ హైకోర్టులో అనేక క్రిమినల్ కేసులు వాదించారు. 


జస్టిస్ ఖన్నా 2005లో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్/జడ్జి-ఇన్‌చార్జ్ హోదాలో ఉన్నారు. 


17 జూన్ 2023 నుంచి 25 డిసెంబర్ 2023 వరకు సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీకి ఛైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, భోపాల్‌లోని నేషనల్ గవర్నింగ్ కౌన్సెల్ జ్యుడిషియల్ అకాడమీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 


Also Read: త్వరలో కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌ 3.0 - ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ ఇంకా ఈజీ