Chhattisgarh Polling: ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు గానూ తొలి విడతలో 20 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 70.87 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ కమాండో తీవ్రంగా గాయపడ్డారు. అదే జిల్లాలోని బాండా పోలింగ్ స్టేషన్ సమీపంలో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బాండే పోలీస్ స్టేషన్ పరిధిలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)లకు నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయి. కాల్పలు జరిగిన ప్రదేశం నుంచి ఏకే 47 రికవరీ అయినట్లు అధికారులు నివేదించారు. అలాగే మధ్యాహ్నం 1 గంటలకు పనావర్ సమీపంలో డీఆర్‌జీ, నక్సల్స్ మధ్య మరొక ఎన్‌కౌంటర్ జరిగింది.
నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓర్చా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పోలింగ్ జరిగిన 20 స్థానాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో 2 గంటల ముందుగానే మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తం పది స్థానాల్లో మూడు గంటలకే పోలింగ్ ముగిసింది. తొలి విడతలో పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్ జరగనుంది.
మిజోరాంలో ముగిసిన పోలింగ్
మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 3 గంటల వరకూ సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రత్యేకంగా నిలిచింది.