ISRO Future Missions: చంద్రయాన్ 3 సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వ్యవస్థకు మూలమైన సూర్యుడిని పరిశోధించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీహరికోట రాకెట్ పోర్ట్‌లో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్‌లో కరోనాగ్రఫీ ఉపగ్రహంగా ఆదిత్య-ఎల్1ని రోదసిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ఆగస్టు చివరి భాగంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో జరగనుంది.
సూర్యుడు, భూమి మధ్య మొదటి లాగ్రాంజ్ పాయింట్ L1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఆదిత్య-L1 వ్యోమనౌకను ఉంచడమే ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం. గ్రహణాలు ఏర్పడినప్పుడు కూడా ఈ కక్ష్యలో ఆదిత్య నిరంతరాయంగా తిరుగుతూ ఉపగ్రహం సూర్యుడిని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. సూర్యుడిని దేవుడిగా భావిస్తూ సూర్యుడిపై ప్రయోగాలకు గుర్తుగా ఆదిత్య-L1 అని దీనికి పేరు పెట్టారు. ఇది ఖగోళంలో అద్భుతాల గురించి తెలుసుకోవడానికి, అవగాహన పెంచడానికి, అన్వేషణ కోసం ఉపయోగపడుతుంది. ఆదిత్య-L1 మిషన్‌తో పాటు 2024లో చేపట్టనున్న వీనస్ మిషన్‌పై ఇస్రో దృష్టి సారించింది. నక్షత్రాలు, ఆకాశాలు, అంతకు మించి చేరుకోవడం కోసం ఇస్రో చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే భారత్ భవిష్యత్‌లో చరిత్ర సృష్టించనుందని నిపుణులు భావిస్తున్నారు.
విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ తర్వాత విజయోత్సవ వేడుకలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తదుపరి ప్రయోగాలపై ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 మిషన్ విజయం అంగారక గ్రహంపైకి వెళ్లడం, అక్కడ చారిత్రాత్మకంగా ల్యాండింగ్ చేయాలనే ఆశయాలను కూడా ప్రేరేపించిందని సోమనాథ్ ప్రకటించారు. భవిష్యత్తులో వీనస్, అంతకు మించి అన్వేషణలు జరిగే అవకాశం ఉందన్నారు. కఠిన మైన సవాళ్లతో కూడుకున్న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ అవడం ద్వారా సమస్యాత్మకమైన రెడ్ ప్లానెట్, మార్స్ పైకి వ్యోమగాములను పంపేందుకు దోహదం చేస్తుందన్నారు.
ఆదిత్య మిషన్ ద్వారా సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోందని ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆదిత్య మిషన్ సెప్టెంబర్‌లో ప్రయోగానికి సిద్ధమవుతోంది. గగన్‌యాన్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి నాటికి ఒక మిషన్ పూర్తి చేస్తామన్నారు. 2025 నాటికి మొదటి మానవ సహిత మిషన్ చేపట్టేందుకు అనేక పరీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సామర్థ్యాన్ని పరీక్షించనున్నట్లు చెప్పారు.