Jharkhand New Government: ఝార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రంలోని ముక్తి మోర్చా పార్టీ నాయకుడు చంపయ్ సోరేన్ గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం (ఫిబ్రవరి 1) రాంచీలోని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా - కాంగ్రెస్ - రాష్ట్రీయ జనతాదళ్ కూటమిలోని ఐదుగురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని చంపయ్ రాజ్ భవన్ కు వెళ్లారు. తనకు ఆ కూటమిలోని 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. గవర్నర్ కు తెలిపారు.


ఈ సందర్భంగా రాజ్ భవన్ బయట చంపయ్ సొరేన్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రజలు ఓ రకమైన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని అన్నారు. 


క్యాంపు రాజకీయాలు


మరోవైపు, అధికార కూటమికి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి నుంచి రాంచీలోని సర్క్యూట్ హౌస్‌లో బస చేశారు. ఈ ఎమ్మెల్యేలను ఎక్కడికో తరలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వచ్చాయి. చివరిని వారిని హైదరాబాద్ కు తరలించారు.


హేమంత్ సోరెన్ రాజీనామా  తర్వాత కూటమి ఎమ్మెల్యేలంతా  జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయ్ సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వం చీలకుండా ఉండేందుకు జేఎంఎం క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనందరినీ హైదరాబాద్‌కు తరలించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం జేఎంఎంకు లేదని బీజేపీ అంటోంది. కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఝార్ఖండ్‌లో అధికారం కోల్పోయే ప్రమాదముందని జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి అప్రమత్తమయింది. ప్రభుత్వాన్ని కూల్చడానికే సీఎం సోరెన్ ను అరెస్టు చేశారని.. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జేఎంఎంకు మద్దతు ఇస్తున్న 47 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు.