గతేడాది డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021లోని నిబంధనలకు అనుగుణంగా రూల్స్ మారుస్తూ కేంద్రం నోటిపికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన మార్పుల ప్రకారం.. ఓటర్ లిస్ట్‌లో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఆధార్, ఓటర్ కార్డుతో అనుసంధానం చేయనుంది. దీనికి అనుమతి ఇస్తూ కేంద్రం కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది.
పీటీఐ వార్తా సంస్థ చెప్పినట్టు ఓటర్ల నమోదు (సవరణ) నిబంధనలు, 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఓటర్ లిస్టులో తమ పేర్లు ఉన్న వాళ్లంతా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలి.
జూన్ 17న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో భారత ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపుల తర్వాత సవరణలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్ట్‌ర్‌లో స్పందించారు. ఎలక్టోరల్ రోల్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయడం కాకుండా, కొత్త ఓటర్లను సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. వైఫ్(భార్య) అనే పదానికి బదులు స్పౌస్(జీవిత భాగస్వామి) పదాన్ని పెట్టారు. జెండర్ తెలియజేసే చోట న్యూట్రల్ అనే పదాన్ని కొత్తగా చేర్చారు.
క్యాలెండర్ సంవత్సరంలో జనవరి 1 లేదా ఏప్రిల్ 1 లేదా జూలై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరుడు వెంటనే ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగు అర్హత తేదీలు ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాయి' అని రిజిజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.