IT Raids On Congress MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు సంబంధిత వ్యక్తులపై ఐటీ శాఖ డిసెంబర్ 6న దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులు ఆదివారం కొనసాగాయి. ఐదు రోజుల లెక్కింపు తర్వాత పట్టుబడిన సొమ్ము రూ.351 కోట్లుగా నిర్ధారించారు. ఇంకా లెక్కించాల్సిన నోట్ల కట్టలు చాలా ఉన్నట్లు అధికారుల సమాచారం.
పట్టుబడిన డబ్బును లెక్కించేందుకు ఆదాయపన్ను శాఖ, వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 80 మందితో కూడిన తొమ్మిది బృందాలు షిఫ్టుల వారీగా 24x7 పని చేశాయి. సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర సిబ్బందితో సహా 200 మంది అధికారులతో కూడిన మరో బృందం 10 అల్మారాల్లో పెద్ద ఎత్తున డబ్బు గుర్తించారు. వివిధ బ్యాంకు శాఖల్లో నగదును డిపాజిట్ చేసేందుకు దాదాపు 200 బ్యాగులు, ట్రంకు పెట్టెలను వినియోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ డబ్బు అంతా మద్యం అమ్మకాల ద్వారా సంపాదించినదని, ఆదాయంలో చూపని డబ్బు అని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తాల్లో ఐదే అత్యధికమని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. తనీఖీలు నిర్వహించిన ప్రదేశాలలోని ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర సిబ్బంది స్టేట్‌మెంట్‌లను డిపార్ట్‌మెంట్ రికార్డ్ చేస్తోంది. అంతేకాదు త్వరలో ప్రధాన ప్రమోటర్లకు సమన్లు జారీ చేయనుంది.
2019లో కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్తపై GST ఇంటెలిజెన్స్ తనిఖీలు చేసి రూ.257 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2018లో తమిళనాడులో రోడ్డు నిర్మాణ సంస్థలో IT శాఖ దాడులు చేసి రూ.163 కోట్ల నగదు సీజ్ చేసింది.
రాజకీయ విమర్శలు
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ దాడిని పెంచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన అవినీతి బయటపడుతుందనే దర్యాప్తు ఏజెన్సీలు దుర్వినియోగం అవుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తన వ్యాపారంతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీకి చెప్పారని కానీ కేంద్రం కాంగ్రెస్, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు.
వైరల్ అవుతున్న ధీరజ్ ప్రసాద్ సాహూ ట్వీట్
దేశంలో నల్లధనంపై ధీరజ్ ప్రసాద్ సాహూ 2022లో ట్వీట్ చేశారు. ఇప్పుడు అది వైర్ అవుతోంది. 2022 ఆగస్ట్ 12న ఆయన ట్విటర్‌లో పేర్కొంటూ.. ‘ నోట్ల రద్దు తర్వాత కూడా, దేశంలో ఇంత నల్లధనం, అవినీతిని చూసి నా హృదయం బాధగా ఉంది. ప్రజలు ఎక్కడ నుంచి ఇంత నల్లధనాన్ని పోగు చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ దేశం నుంచి అవినీతిని తరిమికొట్టగలిగేది కాంగ్రెస్ మాత్రమే’ అని రాసుకొచ్చారు.
పోస్ట్ స్క్రీన్ షాట్‌ను BJP IT సెల్ చీఫ్ అమిత్ మాల్వియా షేర్ చేస్తూ.. "కరప్షన్ కి దుకాన్" అనే హ్యాష్‌ట్యాగ్‌తో "డార్క్ సెన్స్ ఆఫ్ హ్యూమర్" అని రాశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.