Byju's To Cut 5,000 More Jobs


ప్రపంచంలో పలు దేశాల స్టార్టప్స్‌ అన్నింటికీ ఒక మోడల్‌గా నిలిచిన ఎడ్యూటెక్‌ కంపెనీ బైజూస్. భారీ నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు బైజూస్ ఇండియా కొత్త సీఈవో అర్జున్ మోహన్ చర్యలు చేపట్టారు. సంస్థను పునర్ నిర్మించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట ఉద్యోగాల కోత పడనుంది. దాదాపు 4,000- 5,000 మందిని జాబ్ నుంచి తొలగించాలని సంస్థ భావిస్తోంది. ఈ మేరకు కొత్త సీఈవో సీనియర్ ఉద్యోగులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఈ ఉద్యోగాల కోత బైజూస్‌ను నిర్వహిస్తున్న థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులపై, ఆకాష్ ఎడ్యూకేషనల్ సర్వీసెస్ పై సైతం ప్రభావం చూపనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ సీనియర్ ఉద్యోగి అయిన అర్జున్ మోహన్ ఇటీవల భారత విభాగానికి సీఈవోగా నియమితులయ్యారు. తాజాగా చేపట్టనున్న జాబ్ కట్స్ సేల్స్, మార్కెటింగ్ ఇతర విభాగాలపై చూపనున్న ప్రభావంపై సీనియర్ ఉద్యోగులతో సీఈవో చర్చించారు. ఓ వైపు జాబ్ కట్స్, మరోవైపు సంస్థ ఆఫీసు స్థలాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సమస్యల కారణంగా నిధుల సేకరణకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదివరకే పలుమార్లు ఉద్యోగాల కోత వేయగా, తాజాగా మరోసారి 4000 నుంచి 5 వేల మందిని జాబ్ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది.
సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. సంస్థను పునర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఖర్చులు తగ్గించుకునేందుకు కఠిన పరిస్థితుల్లో వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తోందన్నారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ ముగినుంది. అప్పులను సర్దుబాటు చేస్తూనే, ఖర్చులను తగ్గించుకుంటున్నామని చెప్పారు.


మరో 6 నెలల్లో రుణాలు ఇచ్చిన వారికి 1.2 డాలర్ల టర్మ్ లోన్-బి ని చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ నెల మొదట్లో బైజూస్ తెలిపింది. రాబోయే మూడు నెలల్లో ముందుగా 300 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లిస్తామని రుణదాతలకు బైజూస్ ప్రతిపాదన చేసింది. నిధుల సేకరణ కోసం  రెండు కీలకమైన ఆస్తులైన గ్రేట్ లెర్నింగ్, అమెరికా ఆధారిత ఎపిక్‌లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. బైజూస్‌ సంస్తపై 1.2 బిలియన్‌ డాలర్ల (రూ.9892 కోట్లు) మేర అప్పు ఉంది.


ప్రపంచంలోని అతిపెద్ద ఎడ్‌టెక్ సంస్థలలో ఒకటైన బైజుస్ చివరిసారి చెక్ చేసినప్పుడు సంస్థ విలువ 22 బిలియన్ డాలర్లు. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ తో పాటు విదేశాల్లోనూ సంస్థ నిధులను సేకరించడానికి తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటోంది. మే నెలలో సంస్థ డేవిడ్‌సన్ కెంప్‌నర్ 250 మిలియన్ డాలర్లను సేకరించింది. అయితే అమెరి ఆధారిత ఏఎంసీ చర్చలు సరిగా జరగక 150 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 


కాగా, బైజూస్ సంస్థ డేవిడ్‌సన్ కెంప్‌నర్ లోన్‌లో టెక్నికల్ డిఫాల్ట్‌ను కలిగి ఉంది. దాంతో బైజూస్ బైజు రవీంద్రన్ అత్యంత విలువైన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌పై నియంత్రణను కోల్పోకుండా ఉండేందుకు నిధుల సేకరణపై ఫోకస్ చేసింది. తప్పని పరిస్థితుల్లో డేవిడ్‌సన్ కెంప్‌నర్ లోన్ చెల్లింపులో భాగంగా ఆకాష్ షేర్లను బైజూస్ తాకట్టు పెట్టింది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కోసం తోడ్పాటు అందించిన రంజన్ పాయ్ ని కూడా భారీ మొత్తం సహాయం కోరారు. రవీంద్రన్‌కు ఆకాష్‌లో దాదాపు 30 శాతం వాటా ఉందని తెలిసిందే. రవీంద్రన్ వాటాలను రంజన్ పాయ్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని గత నెలలో మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది.