BVR Subrahmanyam is Next NITI Aayog CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులు కావడంతో ఆ కీలక స్థానంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ సోమవారం రాత్రి ఆమోదం తెలపడంతో నీతి ఆయోగ్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా మాజీ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకం కన్ఫామ్ అయింది. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి 2 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.






1987 బ్యాచ్‌కు చెందిన ఛత్తీస్‌గఢ్ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి సుబ్రహ్మణ్యం. గత ఏడాది సెప్టెంబర్ 30న వాణిజ్య కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ పొందారు. అనంతరం తరువాత రెండేళ్ల కాలానికిగానూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. 


గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్రం నిర్ణయించిన సమయంలో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు సుబ్రహ్మణ్యం. జమ్మూకాశ్మీర్ లోని  PDP - BJP సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత జూన్ 2018లో గవర్నర్ పాలన విధించక ముందు ఆయన ఛత్తీస్‌గఢ్‌లో హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 


2004 నుంచి 2008 మధ్య కాలంలో ఈ సీనియర్ ఐఏఎస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. కొంతకాలం ప్రపంచ బ్యాంక్‌లో పనిచేసిన తర్వాత 2012లో ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి తిరిగి వచ్చారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అవకముందు కొంతకాలం ప్రధానమంత్రి కార్యాలయంలో సేవలు అందించారు. అంతర్గత భద్రత వ్యవహరాలలో ఆయనకు చాలా నైపుణ్యం ఉంది.


నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంకులో బాధ్యతలు చేపట్టనున్నారు. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన నియమితులయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. దాంతో ఈ కీలక పదవిని మాజీ ఐఏఎస్ సుబ్రహ్మణ్యంతో భర్తీ చేయనున్నారు. 2009లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన పరమేశ్వరన్ అయ్యర్ 2014లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ కు నాయకత్వం వహించారు. పరమేశ్వరన్ అయ్యర్ 2022 జూలై 1న నీతి ఆయోగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 


1981లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో పరమేశ్వరన్ అయ్యర్ చేరారు. ప్రపంచ బ్యాంకు విధుల కోసం వియత్నాం, చైనా, ఈజిప్ట్, లెబనాన్, వాషింగ్టన్‌లలో పనిచేశారు. ఆ తరువాత 2016లో భారత ప్రభుత్వంలోని డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖలో చేరారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.