Shiv Sena Symbol: ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య నడుస్తున్న ఫైట్‌ కారణంగా శివసేన గుర్తును స్తంభింపజేసింది. అంధేరిలో ఈస్ట్‌ సీటుకు జరిగే ఉపఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఠాక్రే శివసేనకు ఊహించని షాక్‌ లాంటిదే చెప్పవచ్చు. 


శివసేన 'విల్లు, బాణం' గుర్తుపై శిందే, ఠాక్రే వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి తూర్పు స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేనకు రిజర్వ్ చేసిన 'విల్లు, బాణం' చిహ్నాన్ని ఉపయోగించడానికి రెండు వర్గాలను అనుమతించబోమని కమిషన్ శనివారం (అక్టోబర్ 8) తెలిపింది.


ఈ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఉచిత చిహ్నాల జాబితా నుంచి వేర్వేరు చిహ్నాలను ఎంచుకోవాలని రెండు వర్గాలను కోరినట్లు కమిషన్ తెలిపింది. అక్టోబర్ 10న మధ్యాహ్నం 1 గంటలకు రెండు గ్రూపులు స్పందించాల్సి ఉంటుంది.


శివసేన విల్లు, బాణం గుర్తు తమకు ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం పోరాటం చేస్తోంది. దీనికి ఈ మధ్యాహ్నం 2 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కోరింది. ఈ కేసులో విచారణ ప్రారంభించడానికి వీలుగా అక్టోబర్ 7 లోగా తమ వాదనలు వినిపించాలని, లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని ఈసి గతంలో రెండు వర్గాలను కోరింది.


ఈ చిహ్నాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి నవంబర్ 3 అంధేరి ఈస్ట్ సీటు ఉపఎన్నిక జరిగే లోపు ఈ గుర్తును తమకు కేటాయించాలని శిందే వర్గం కోరింది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని శిందే వర్గం అక్టోబర్ 4న రాసిన లేఖలో ఈసిని కోరింది. ఈ ఏడాది మేలో శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. శివసేన ఎన్నికల చిహ్నం విల్లు బాణంను తనకు ఇవ్వాలని శిందే వర్గం డిమాండ్ చేసింది.


శిందే వర్గం వాదన ఏమిటి?


తమకు మెజారిటీ శివసేన సభ్యుల మద్దతు ఉందని పేర్కొంది శిందే శిబిరం. థాకరే నేతృత్వంలోని శివసేనకు మెజారిటీ మద్దతు లేదని పేర్కొంది. దీనిపై ఆ పార్టీ ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది. శివసేనలో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి అసలు సిసలైన శివసేన గురించి వివాదం నడుస్తోంది. ఏక్నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తమను తాము నిజమైన శివసేన అని పిలుచుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల సంఘం విచారణ చాలా ముఖ్యమైంది. ఏ వర్గానికి 'విల్లు, బాణం' గుర్తు పొందాలో నిర్ణయించాల్సి వస్తోంది. అలా కేటాయించిన పార్టీయే నిజమైన శివసేనగా మారనుంది. అందుకే ఈ గుర్తు కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 


ఎన్నికల గుర్తు వాడకంపై నిషేధం 


వచ్చే ఎన్నికల్లో థాకరే వర్గీయులు విల్లు, బాణం గుర్తు ఉపయోగించకుండా చేసేందుకు శిందే వర్గీయులు గట్టిగానే ప్రయత్నించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. అంధేరి ఉపఎన్నికల్లో గుర్తు వాడకాన్ని నిషేధం మాత్రం ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పెద్ద ఎదురుదెబ్బగానే మారణందు. 


సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించాయి ఇరు వర్గాలు. చాలా రోజుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఈ మధ్య సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ అంశంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.