Bombay High Court: చిన్న పిల్లలపై లైంగిక దాడి కేసులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది బాంబే హైకోర్టు. మెడికల్ సర్టిఫికేట్ లో బాధితురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేనట్లు తెలిసినా.. కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని వివరించింది. నేరం పోక్సో చట్టం పరిధిలోకి రావడం వల్లే మెడికల్ సర్టిఫికేట్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే చిన్న పిల్లల వ్యక్తిగత భాగాలను ఆ ఉద్దేశంతో తాకినా అది లైంగిక దాడి కిందకే వస్తుందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. 


లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు..!


అయితే 2013వ సంవత్సరంలో.. ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటున్న ఓ పాపను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత పాప వ్యక్తిగత భాగాలను తాకాడు. ఆ బాలిక ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం గురించి తన తల్లికి  చెప్పింది. చుట్టు పక్కల వారు ఆ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఆ వ్యక్తి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అలా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆ వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు తల్లి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. 


నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష..


ముంబైలోని ప్రత్యేక పోక్సో చట్టం కోర్టు నవంబర్ 2017 లో ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. ఆధారాలు అన్నీ సరిగ్గా ఉండటంతో అతను నేరం చేశాడని కోర్టు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354(స్త్రీపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన కేసులు అతనిపై పెట్టారు పోలీసులు. ఈ మేరకు విచారించిన కోర్టు.. ఐపీసీ, పోక్సో చట్టంలోని సెక్షన్ 8(లైంగిక వేధింపు) ప్రకారం అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జస్టిస్ సారంగ్ వి కొత్వాల్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.


వ్యక్తిగత భాగాలను తాకడం లైంగిక దాడే..!


లైంగిక దాడి కేసులో శిక్ష ఎదుర్కొంటున్న దోషి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు శిక్ష ఎదుర్కొంటున్న దోషి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఈ సందర్భంగా లైంగిక దాడి గురించి మరింత స్పష్టతను ఇచ్చింది. ఆ ఉద్దేశంతో.. చిన్న పిల్లల వ్యక్తిగత భాగాలను తాకడం, తడమడం లాంటి పనులు చేయడం కూడా లైంగిక దాడి కిందకే వస్తుందని స్పష్టం చేసింది.   


మైనర్ బాలికలు అయినందున అలా ప్రవర్తించడం, వ్యక్తిగత భాగాలను తాకడం ముమ్మాటికి లైంగిక దాడేనని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు చెప్పిన ఈ వ్యాఖ్యల పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల పోక్సో చట్టం మరింత బలంగా తయారు అయిందని అభిప్రాయపడుతున్నారు.