బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన నిర్వహించిన జనసభ ప్రాంగణంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. 


అయితే వేదికకు 15 నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు జరిగింది. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.





ఇటీవల

 

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఇటీవల ఓ యువకుడు దాడి చేశాడు. నితీశ్ కుమార్ తన స్వగ్రామం భకిత్యాపూర్‌లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

 

భకిత్యాపూర్ లోని స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్‌భద్ర యాజీ అనే స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సీఎం నితీశ్ ఆవిష్కరించడానికి అక్కడికి వచ్చారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నప్పుడు ఓ యువకుడు వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్‌పైకి వచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చిన యువకుడు సీఎం వీపుపై బలంగా కొట్టాడు. మరోసారి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. భద్రతా సిబ్బంది ఉండగా ఓ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. 






















గతంలోనూ దాడి


ఇది మొదటి ఘటన కాదు. బిహార్ సీఎంపై గతంలో కూడా దాడి జరిగింది. 2020 నవంబర్‌లో మధుబని జిల్లాలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు నితీష్ కుమార్‌పై ఉల్లిపాయలు విసిరారు. ఉల్లిపాయలు విసరడంతో మొదట అవాక్కైన నితీశ్ తర్వాత లైట్ తీసుకుని "ఖూబ్ ఫెంకో-ఖూబ్ ఫెంకో" (మరికొన్ని విసరండి) అని హాస్యాస్పదంగా అన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది నితీశ్ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. దీంతో నిందితుడు ఎవరైనా వదిలేయమని అతని గురించి పట్టించుకోవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు.


Also Read: Bihar CM Attacked Video : బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై యువకుడు దాడి, వీడియో వైరల్