Bku Chief Rakesh Tikait Warning : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) చీఫ్ రాకేశ్ టికాయత్ (Rakesh Tikait)... కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతల (Farmers Protest)కు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై (Minimum Support Price) చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ నుంచి ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బయలుదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎన్నో రైతు సంఘాలు ఉన్నాయన్న ఆయన...ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉంటుందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం హస్తినకు బయలుదేరిన రైతులకు అడ్డంకులు సృష్టించవద్దన్న రాకేశ్ టికాయత్, వారికి మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇప్పటికిప్పుడు చట్టాన్ని తీసుకురాలేమన్న అర్జున్ ముండా
మరోవైపు రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలకు కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేమని స్పష్టం చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్న ఆయన, దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు. అన్నివర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుందని అర్జున్ ముండా స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం...రైతు సంఘాల ప్రతినిధులు జగ్జీత్‌సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ తదితరులతో చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటిని అమలు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం అంగీకరించింది. అయితే రైతుల ప్రధాన డిమాండ్...కనీస మద్దతు ధర అంశం చట్టబద్ధతకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు.
కర్షకులకు అన్యాయం చేస్తోందన్న జైరాం రమేశ్
రైతుల కోసం పాటుపడిన చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లను భారతరత్నతో సత్కరించిన కేంద్రం...అదే రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు 1.5 రెట్ల కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న ఆయన, 2008లో యూపీఏ ప్రభుత్వం రూ.72 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కర్షకులకు తీవ్ర అన్యాయం చేస్తోందని జైరాం రమేశ్ మండిపడ్డారు.
ఆరు నెలలకు సరిపడా సామాగ్రి సిద్ధం
తమ డిమాండ్లను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీ దిశగా అన్నదాతలు బయలుదేరారు. పంజాబ్, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయలుదేరారు. సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలతో సహా కావాల్సిన అన్నీ ట్రాలీల్లో సమకూర్చుకున్నారు రైతులు. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. యాత్రను భగ్నం చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు.