BJP Meeting: ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన తరువాతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. నామినేషన్లు వేయడానికి కొన్ని రోజులు మాత్రమే ఉందనగా బీజేపీ సీఈసీ భేటీని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశంలోనే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి, ఎవరు ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారు అనే విషయాలపై కీలక భేటీలో చర్చించనున్నారు. ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈసారి ఎవరి ఊహకు అందని విధంగా బీజేపీ సీఈసీ భేటీ ని నిర్వహిస్తున్నారు. బీజేపీ ఏర్పడిన తరువాత ఆ పార్టీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల కు ఇంకా మూడు నెలల సమయం ఉంది అనగానే సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ మీటింగ్‌ని ఏర్పాటు చేస్తున్నారు. 


ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఆ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గురించి కూడా ఈ భేటీ లో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌ క్వార్టర్స్ లో బుధవారం నాడు ఎలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్‌ షా తో పాటు మొత్తంగా 15 మంది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ కి సంబంధించిన సభ్యులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. మధ్యప్రదేశ్‌, చత్తీసఘడ్, రాజస్థాన్‌, తెలంగాణ తో పాటు మిజోరానికి కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. 


ఆ రాష్ట్రాల్లో తమ పాగా వేసేందుకు పాటించాల్సిన వ్యూహాల పై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ ఛార్జ్లతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా హాజరవుతారు. ఈ సమావేశానికి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కూడా రానున్నట్లు సమాచారం. 
ఈ ఐదు రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా పాతలన్నది బీజేపీ ముఖ్య లక్ష్యం. దానికి తగినట్లుగానే వ్యూహాలు పన్నుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న విషయాల గురించి పార్టీ అధ్యక్షులను అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం బీజేపీ పెద్దలు ఎక్కువగా దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పవచ్చు.


దీని గురించి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చిస్తారు. అధ్యక్షుడి మార్పు తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ తగ్గిందన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో గెలుపు అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఎవరెవర్ని బరిలోకి దించాలి వంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. రాజస్థాన్ లో కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగు పడింది. రాజస్థాన్‌లో మరోసారి వసుంధరరాజేను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.ఐదు రాష్ట్రాల్లోని చాలా నియోజవర్గాల్లో అభ్యర్థుల జాబితాను కూడా రేపే ఖరారు చేసే అవకాశముంది. అయితే అధికారికంగా మాత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటించరు. 


మంగళవారం ఉదయం ఎర్ర కోట పై నుంచి ప్రసంగించిన మోడీ మరోసారి అవకాశం వస్తే మళ్లీ ఇక్కడి నుంచే ప్రసంగిస్తానని పరోక్షంగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత కొనసాగుతున్నప్పటికీ..మోడీ కి మాత్రం ప్రజల్లో మంచి పేరే ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే విపక్షాలు బలంగా లేకపోవడం. దీంతో బీజేపీ కి ఏ రాష్ట్రంలో ఎలా తమ వ్యూహాలు అమలు చేయాలి అనే దాని మీద పూర్తి క్లారిటీ ఉంది. ఐ.ఎన్‌.డి.ఐ.ఏ పేరుతో కూటమిగా ఏర్పడినప్పటికీ..దేశ ప్రజలు తమ వెంట వస్తారన్న నమ్మకంతో ఉన్నారు బీజేపీ నేతలు. అందుకే ఆ ఐదు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది.