Bihar Female Constables Viral video: ఓ వైపు హాజీపూర్‌కు చెందిన లేడీ కానిస్టేబుళ్లపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు కైమూర్‌లో ఓ వృద్ధుడిపై ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు లాఠీచార్జి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బిహార్ లోని కైమూర్ జిల్లాలో శుక్రవారం జయప్రకాష్ చౌక్ వద్ద వృద్ధ ఉపాధ్యాయుడు 65 ఏళ్ల నావల్ కిషోర్ పాండే సైకిల్‌పై రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు ఆయనను ఆపారు. వృద్ధుడిపై లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు లేడీ కానిస్టేబుల్స్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కైమూర్ ఎస్పీ ఈ ఘటనపై విచారణకు డీఎస్పీని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
కైమూర్ జిల్లాలోని భబువాలోని జయప్రకాష్ చౌక్ వద్ద సమీపంలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో ఓ 65 ఏళ్ల టీచర్ నావల్ కిషోర్ పాండే సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు వృద్ధుడిని అడ్డగించారు. కానిబస్టేబుల్స్ తనను ఎందుకు ఆపారా అని ఆలోచిస్తున్న ఆ టీచర్ ను తమ లాఠీలతో కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడుగుతుండగా ఆ పెద్దాయనపై మరింతగా దాడి చేశారు లేడీ కానిస్టేబుల్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధితుడు ఏమన్నారంటే..
బాధిత వృద్ధ ఉపాధ్యాయుడు నావల్ కిషోర్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లీషు సబ్జెక్టు బోధిస్తున్నట్లు తెలిపారు. ఇంకా తాను ఓ చోట ఫ్రీ ట్యూషన్ కూడా చెబుతున్నట్లు తెలిపారు. స్కూల్ లో తన డ్యూటీ ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జయప్రకాష్ చౌక్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాను. సైకిల్ తొక్కుతూ రోడ్డు దాటుతుండగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఏదో అన్నారు. వారి మాటల్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారిగా ఓ లేడీ కానిస్టేబుల్ తనను ఆపిందని, సైకిల్ దిగిన వెంటనే కానిస్టేబుల్స్ లాఠీలతో తనను కొట్టి గాయపరిచారని బాధతో చెప్పారు. ఎందుకు కొడుతున్నారని అడగగా, మమ్మల్ని ఎందుకు తిడుతున్నావంటూ తిరిగి తననే ప్రశ్నిస్తూ లాఠీఛార్జ్ చేసినట్లు చెబుతూ టీచర్ నావల్ కిషోర్ పాండే వాపోయారు.
నివేదిక వచ్చిన తర్వాత చర్యలు- ఎస్పీ
కైమూర్ ఎస్పీ లలిత్ మోహన్ శర్మ స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని భభువా డీఎస్పీని ఆయన ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత లేడీ కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకుంటాం అన్నారు. పోలీసుల ప్రతిష్టను దిగజార్చే ఏ విషయాన్ని అయినా సీరియస్ గా తీసుకుంటాం అన్నారు.