Bihar Voters List Supreme Court:  బీహార్‌లో ఎన్నికల సంఘం (ECI) నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ నుండి తొలగించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బీహార్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ నుండి తొలగించిన సుమారు 65 లక్షల ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారుల వెబ్‌సైట్‌లలో జిల్లాల వారీగా ప్రచురించాలని ఆదేశించింది.  ఈ జాబితా బూత్ వారీగా ఉండాలి,  ఓటర్లు తమ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) నంబర్ ఆధారంగా పరిశోధించేలా ఉండాలని సూచించింది. అదే విధంగా  తొలగింపు కారణాలను అంటే మరణం, వలస, డబుల్ రిజిస్ట్రేషన్ వంటివి జాబితాలో స్పష్టంగా పేర్కొనాలని.. ఈ జాబితా బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించబడాలని ఆదేశాలు జారీ చేసింది.  తొలగించిన ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చడానికి దాఖలు చేసే క్లెయిమ్‌లలో ఆధార్ కార్డ్‌ను కూడా సమర్పించవచ్చని ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.   ECI గతంలో పేర్కొన్న 11 డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్ కార్డ్ చేర్చనప్పటికీ, సుప్రీంకోర్టు దీనిని స్పష్టంగా చేర్చమని ఆదేశించింది.  ఆధార్ , EPIC కార్డులు సాధారణంగా ఓటర్లకు సులభంగా అందుబాటులో ఉంటాయని అందుకే వాటిని అనుమతించాలని ఆదేశించింది.  తొలగించిన ఓటర్ల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని బీహార్‌లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇందుకోసం స్థానిక వార్తాపత్రికలు, టీవీ, రేడియో, జిల్లా ఎన్నికల అధికారుల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 

ఈ జాబితా బూత్ లెవెల్ ఆఫీసర్ల నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శించాలని.. తద్వారా ఓటర్లు మాన్యువల్‌గా సమాచారాన్ని తెలుసుకోగలరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమ  ఆదేశాలను రాబోయే మంగళవారం  అంటే ఆగస్టు 19, 2025 నాటికి అమలు చేయాలని సుప్రీంకోర్టు ECIని నిర్దేశించింది.  తదుపరి విచారణ ఆగస్టు 22కు వాయిదా వేసింది. 

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ECI జూన్ 24, 2025న SIR ప్రక్రియను ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులైన ఓటర్లు అంటే మరణించినవారు, వలస వెళ్లినవారు, డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు,  చట్టవిరుద్ధ వలసదారుల పేర్లను తొలగించి, ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేస్తున్నారు.  ఈ ప్రక్రియలో 7.24 కోట్ల ఓటర్లతో డ్రాఫ్ట్ రోల్ ప్రచురించారు.  అంతకు ముందు జాబితాలో ఉన్న 65 లక్షల పేర్లు తొలగించారు.  వీరిలో  22.34 లక్షల మంది చనిపోయారని,  36.28 లక్షల మంది శాశ్వతంగా వలసపోయారని, మరో ఏడు లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నారని ఈసీ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రకటించే జాబితాలతో నిజంగా అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిస్తే ఆ విషయం బయటపడే అవకాశం ఉంది. వారు మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.