ఒకే కంచంలో ఇద్దరు తినొచ్చు.. ఒకే మంచంలో ఇద్దరు.. పెద్ద మంచమైతే ముగ్గురు కూడా సర్దుకోవచ్చు. కానీ ఒకే  బ్లాక్ బోర్డును ఇలా పంచుకోవడం సాధ్యమా  ?. సాధ్యమే. ఒకటే తరగతి. కానీ రెండు తరగతులు జరుగుతున్నాయి.  బ్లాక్ బోర్డు ఓ వైపు ఉర్దూ టీచర్ పాఠాలు చెబుతున్నారు. మరో వైపు హిందీ టీచర్ పాఠాలు చెబుతున్నారు. స్టూడెంట్స్ ఎప్పట్లాగే వారి గోల వారు చేస్తున్నారు. వారిని అదుపు చేయడానికి మరో సీనియర్ టీచర్ బెత్తం పట్టుకుని సైలెన్స్ అని అరుస్తున్నారు. ఈ దృశ్యం బీహార్‌లో వెలుగు చూసింది. 


ఇటీవల బీహార్‌లో స్కూళ్లను విలీనం చేశారు. ఇలా విలీనం చేసిన స్కూళ్లలో విద్యార్థులు పెరిగిపోయారు. కానీ తరగతి గదుల్లేవు. దీంతో ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో రెండు తరగతుల విద్యార్థుల్ని కూర్చోబెట్టారు. బ్లాక్ బోర్డును టీచర్లు సగం సగం పంచుకున్నారు. ఓ వైపు ఉర్దూ చెప్పడం ప్రారంభించారు. మరోవైపు టీచర్ హిందీ చెప్పడం ప్రారంభించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 




స్కూల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందని..అందుకే ఇలా పాఠాలు చెప్పాల్సి వస్తోందని టీచర్లు అంటున్నారు. 



అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఆదర్శ్ మిడిల్ స్కూల్లో విద్యార్థులు తక్కువగా ఉంటారని అందుకుని రెండు క్లాసులకు రెండు తరగతి గతులు అడ్జస్ట్ చేయడం సాధ్యం కాలేదనిచెబుతున్నారు.  






బీహార్‌లో విద్యా ప్రమాణలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దితే .. మరి ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.