Patna Junction Video : బిహార్ రాష్ట్రంలోని పట్నా రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనపై ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన టీవీల్లో మూడు నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అవాక్కయ్యారు. యాడ్ లు, రైల్వే సమాచారం కోసం ఏర్పాటుచేసిన టీవీల్లో అసభ్యకర వీడియోలు ప్రసారం అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్నా రైల్వే స్టేషన్‌లోని 10 ప్లాట్‌ఫారమ్‌లలో ఏర్పాటు చేసిన అన్ని టీవీ స్క్రీన్‌లలో దాదాపు మూడు నిమిషాల పాటు అసభ్యకరమైన వీడియో క్లిప్ ప్లే అయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు,  కొంతమంది ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పట్నా రైల్వే స్టేషన్ అధికారులకు చెప్పడంతో వెంటనే టెలికాస్ట్‌ను నిలిపివేశారు. దానాపూర్‌ డివిజన్‌ ​​పరిధిలోని రైల్వే స్టేషన్లలో వీడియోలు, యాడ్‌ ఫిల్మ్‌లను ప్రసారం చేసేందుకు ఓ ప్రైవేట్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు రైల్వే అధికారులు. ఈ ఘటనపై దానాపూర్‌లోని డీఆర్‌ఎం కార్యాలయ అధికార ప్రతినిధి ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ.. విచారణ ప్రారంభించి కాంట్రాక్టు రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈ కంపెనీ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నారు. 


సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ 


భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా ఉన్న పట్నా రైల్వే స్టేషన్‌లో....తమ గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఎక్కేందుకు వేచి ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఈ సంఘటన పెద్ద షాక్‌నిచ్చింది. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. పలువురు ప్రయాణికులు ఈ విషయాన్ని RPF, రైల్వే స్టేషన్ అధికారులకు తెలిపారు. అసభ్యకర వీడియో క్లిప్‌ను మూడు నిమిషాలకు పైగా ప్రసారం అయిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులు ఈ వైరల్ వీడియోను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీవీ స్క్రీన్‌లపై ప్రకటనలు, సమాచారాన్ని ప్రసారం చేయడానికి బాధ్యత వహించే ఏజెన్సీపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు అధికారులు. 


కాంట్రాక్టు రద్దు 


 యాడ్ లను నిర్వహిస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటన మొదటిది కాదన్నారు. ఆదివారం ఉదయం కూడా అదే రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీఆర్‌పీ సిబ్బంది చర్యలు తీసుకోవడం ఆలస్యం కావడంతో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వెంటనే స్పందించారు. యాడ్ లను ప్రసారం చేసే కాంట్రాక్టు తీసుకున్న దత్తా కమ్యూనికేషన్స్‌కు సమాచారం అందించారు. దీంతో అసభ్య వీడియోల ప్రసారాన్ని నిలిపివేశారు.  ఆ తర్వాత రంగంలోకి దిగిన రైల్వే అధికారులు దత్తా కమ్యూనికేషన్స్‌పై చర్యలు చేపట్టారు. ఆ ఏజెన్సీని బ్లాక్‌ చేసి, నిర్వాహకులపై ఫైన్ విధించారు. అలాగే కాంట్రాక్టును కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.