Bihar Bridge Collapse: బిహార్ లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న అగువానీ- సుల్తాన్‌గంజ్ బ్రిడ్జి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఓసారి కుప్పకూలిన ఈ బ్రిడ్జిని పునరుద్ధరణ పనులు చేపట్టి ఇప్పుడు ప్రారంభిస్తున్నారని అనుకుంటే పొరబడినట్లే. సుమారు 1700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ వంతెన ఇప్పుడు రెండోసారి కుప్పకూలి వార్తల్లో నిలిచింది. ఆదివారం మరోసారి ఈ బ్రిడ్జి గంగానదిలో కూలిపోయి పడిపోయింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 'పుల్ నిర్మాణ్ నిగమ్' నుంచి నివేదిక కోరినట్లు డీడీసీ భాగల్‌పూర్ కుమార్ అనురాగ్ తెలిపారు.
ఇక ఈ రోజు ఆదివారం కావడంతో చాలా తక్కువ మంది కార్మికులు ఉండడంతో బ్రిడ్జిపై ఎలాంటి పునురుద్ధరణ పనులు జరగడం లేదని స్థానిక అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. వంతెన కనీసం 3 అడుగుల భాగం దిగువన ఉన్న గంగా నదిలో కూలిపోయింది.
నితీశ్ కుమార్ సర్కారుపై బీజేపీ ఫైర్
ఖగారియా, అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండు సార్లు కూలిపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి, తేజస్వి యాదవ్ లు తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ్ డిమాండ్ చేశారు.
'2020 లో పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ వంతెన పనులను బిహార్ సీఎం నితీష్ కుమార్ 2015లో ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్ లోనూ ఈ బ్రిడ్జి లోని కొంత భాగం కూలిపోయింది. ఇప్పుడు రెండోసారి కుప్పకూలింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారా? ఇలా పదవులకు రాజీనామా చేయడం ద్వారా మేనమామ, మేనల్లుడు ఇద్దరూ దేశం ముందు ఆదర్శంగా నిలవగరు. అంటూ బీహార్ బీజేపీ నేత అమిత్ మాలవీయ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
బిహార్ ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ సర్కారులో కమీనష్లు కోరే సంప్రదాయం ఉందన్నారు. అరాచక, అవినీత పాలన ఫలితం ఇదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవస్థ కుప్పకూలుతుంటే.. వారు మాత్రం ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.