బిహార్‌లోని నవాడా అనే పట్టణంలో ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ఊళ్లో జరిగిన ఓ భారీ నేరం విషయంలో జనాన్ని సమీకరించి పంచాయితీ పెట్టించారు. అందులో గ్రామ పెద్దలు ఓ తీర్మానం చేశారు. అత్యాచార నిందితుడిని పోలీసులకు అప్పగించడానికి బదులు, పంచాయితీ అతడికి ఓ శిక్ష వేసింది. ఆ శిక్ష ఏంటో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా అత్యాచారం చేసిన ఆరోపణలు వచ్చినా అందుకు గుంజీళ్లు తీయమని పంచాయితీ పెద్దలు శిక్ష వేశారు. కేవలం 5 గుంజీళ్లు తీయమని శిక్ష వేశారు. పంచాయితీకి వచ్చిన ప్రజల ముందు నిందితుడు గుంజీళ్లు తీశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతణ్ని విడిచిపెట్టారు. ఈ ఘటన నవాడా ప్రాంతంలోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నౌజ్ గ్రామంలో జరిగింది.


అక్బర్ పూర్ సమీపంలోని కన్నౌజ్ గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికను ఓ యువకుడు తన రేప్ చేశాడనేది ఆరోపణ. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో న్యాయం కోసం పంచాయితీ పెట్టించారు. విషయం బయటకు పొక్కడంతో పంచాయితీ పెట్టి నిందితులను పిలిపించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించడం కాకుండా అందరి ముందూ 5 సార్లు గుంజీళ్లు తీయాలని పంచాయితీ పెద్దలు ఆదేశించారు. నిందితుడు గుంజీళ్లు తీసి ఆ ఆరోపణల నుంచి విముక్తి పొంది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


పంచాయితీ ఆదేశం, శిక్ష ప్రక్రియను అక్కడే ఉన్న ఎవరో వీడియో తీశారు. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నిందితుడు సిట్‌ అప్‌లు చేస్తూ కనిపించాడు. ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ ఘటన చాలా దారుణం అని అందులో చెప్పాడు.


6 ఏళ్ల అమాయకురాలిపై అత్యాచారం


ఇంత జుగుప్సాకరమైన, అమానవీయమైన కేసును అణచివేయడం సరికాదని స్థానికులు అంటున్నారు. నవంబర్ 21న గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికను నిందితుడు యువకుడు ప్రలోభ పెట్టి తన కోళ్ల ఫారానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసహ్యకరమైన పనులు చేశాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అమ్మాయి తండ్రి ఊరి బయట ఉన్నాడు. బాలిక మామయ్యకు విషయం తెలియడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరాడు. ఇంతలో నిందితుడు తన యజమానిని సంప్రదించాడు. అతని బాస్ ముఖియాజీ పెద్ద ఆసామి. ఆయన పలుకుబడితో పంచాయితీ నిర్వహించి సమస్యను పరిష్కరించాడని స్థానిక వార్తా పత్రికలు రాశాయి.


పోలీసులు జోక్యం చేసుకోలేదు


ఈ వ్యవహారంలో బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి కూడా చేసి, డబ్బు ముట్టజెప్పినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మేనేజ్ చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడ్డారు. నిందితుడిని కొందరు అరుణ్ పండిట్‌ అని చెప్పారు. కోళ్ల ఫారంలో పని చేస్తుంటాడు. ఈ ఘటన అక్బర్‌పూర్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఇంత హేయమైన చర్యను ఎందుకు అణచివేశాని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ విషయం పోలీసులకు ఇంకా తెలియలేదు.