Tej Pratap Yadav News | పాట్నా: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా ముగిసాయి. హోలీ వేడుకల్లో భాగంగా ఓ విచిత్రం జరిగింది. డాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతావు అన్న మాటలకు భయపడి ఏదో నామమాత్రంగా కానిస్టేబుల్ డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ కానిస్టేబుల్ నిజంగానే సస్పెండ్ అయ్యాడు. బిహార్ లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


 ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఆదేశించడంతో బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్ (హోంగార్డు) దీపక్ కుమార్‌ సస్పెండ్ అయ్యారు. దీపక్ కుమార్ స్థానంలో మరో కానిస్టేబుల్‌ను నియమించినట్లు పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఒక ఉత్తర్వులో తెలిపింది.


పాట్నాలోని తన నివాసంలో శనివారం హోలీ వేడుకల సందర్భంగా తేజ్ ప్రాతప్ యాదవ్ పోలీసు సిబ్బందిని డ్యాన్స్ చేయమని సూచించారు. ఈరోజు హోలీ, ఏం మైండ్ లో పెట్టకోకు. డాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతావని ఆదేశించారు. మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక కొన్ని సెకన్ల పాటు కానిస్టేబుల్ డ్యాన్స్ చేసినట్లు కనిపించారు. ఆ వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. అధికార ఎన్డీఏ పార్టీ నేతల నుంచిడి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 






వైరల్ అయిన వీడియోలో ఏముందంటే.. తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ పోలీసుతో.. ఏయ్ పోలీస్.. ఇప్పుడు ఓ పాట ప్లే చేస్తాం. అది స్టార్ట్ కాగానే నువ్వు డ్యాన్స్ చేయాలి. ఇది హోలీ పండుగ. ఏం పర్లేదు. డ్యాన్స్ చేయండి. లేకపోతే సస్పెండ్ చేస్తా అని వార్నింగ్ ఇస్తున్నట్లు చూడవచ్చు. పాట స్టార్ట్ కాగానే ఇష్టం లేకున్నా కానిస్టేబుల్ స్టెప్పులు వేయడం కనిపిస్తుంది. డ్యాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతావని తేజ్ ప్రతాప్ హెచ్చరికతో డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్ నిజంగానే సస్పెండ్ అయ్యాడు. వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 






జెడి(యు) జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ ఈ ఘటనపై స్పందించాడు. బిహార్‌లో ‘జంగల్ రాజ్' ముగిసింది, కానీ లాలూ యాదవ్ కుమారుడు పోలీసును బెదిరిస్తున్నాడు.  డాన్స్ చేయమని తన సూచనలను పాటించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. కానీ బిహార్ పూర్తిగా మారిపోయింది. తేజస్వి యాదవ్ అయినా, తేజ్ ప్రతాప్ యాదవ్ అయినా, లేదా లాలూ కుటుంబ సభ్యులు ఎవరైనా.. బిహార్ లో ఇలాంటి సీన్ ఇక నడవదని తెలుసుకుంటే మంచిదన్నారు.