ఉన్నతాధికారుల వ్యవహారశైలి, చర్యలు సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల భద్రత పేరుతో ఆంక్షలు అమలు చేసి, పేదల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ విషయంలో తరచూ అధికారులపై విమర్శలు వస్తున్నా, పని తీరును మార్చుకోవడం లేదు. చంటి బిడ్డతో అంబులెన్స్ లో ఉన్న మహిళా రోదిస్తున్న వీడియో వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రతిపక్షాలు నితీష్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


నలందలో ఇథనాల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో అనారోగ్యంతో ఉన్న చంటిబిడ్డను ఆసుపత్రికి వెళుతున్న ఓ మహిళ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తమ అంబులెన్స్‌కు దారివ్వాలని, త్వరగా ఆస్పత్రికి వెళ్లే మార్గమైనా చూపించాలని భద్రతా సిబ్బందిని అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయింది. అంబులెన్సులో లోపల చంటిబిడ్డతో మహిళ ఆందోళన చెందుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కాన్వాయ్‌ వెళ్లిపోయే వరకు అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో...చిన్నారి స్పృహ కోల్పోయాడు. చిన్నారి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే పట్నాలోని ఆసుపత్రికి వెళ్లాలని చెప్పినా సెక్యూరిటీ పట్టించుకోలేదని అంబులెన్స్‌ డ్రైవర్‌ వెల్లడించారు. నెల రోజుల క్రితం కూడా బిహార్‌లో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడు అంబులెన్స్‌ను ఆపిన పోలీసును గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.