Rs 2000 Notes deposit/exchange:
రూ.2000 నోట్లను మార్చుకోలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కలిగించింది. డినామినేషన్ చేసిన రూ. 2,000 నోట్ల మార్పిడితో పాటు డిపాజిట్ గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ పెద్ద నోటు మార్పిడికి, బ్యాంకులో డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్ 30, 2023తో ముగియనుంది. కొందరు ఇంకా నోట్లు మార్చుకోవడం వీలుకాలేదని రిక్వెస్ట్ లు రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023న ఆర్బీఐ ప్రకటించింది. తాజాగా సమీక్ష చేసిన అనంతరం రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి తుది గడువును అక్టోబర్ 07 వరకు పొడిగించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.


'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank of India) రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని ఈ ఏడాది మే 19న నిర్ణయించింది. అంతకుముందే, అంటే 2018-19లోనే ఈ పెద్ద నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ నిలిపివేసింది. ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా చూడడమే RBI 'క్లీన్ నోట్ పాలసీ' ఉద్దేశం అని తెలిసిందే. 


2000 రూపాయల నోట్లను చలామణి నుంచి తీసేసినప్పటికీ.. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆర్బీఐ ఛాన్స్ ఇచ్చింది. ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌కైనా వెళ్లవచ్చని, విత్‌డ్రా ప్రకటన సమయంలోనే ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది. 2000 నోట్లను ఖాతాల్లో డిపాజిట్‌ చేయడం/ఎక్సేంజ్‌ చేసుకునే అవకాశం సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో (ROలు) కూడా వచ్చే నెల 7 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు అని స్పష్టం చేశారు.






ఈ ఆగస్టు 31 నాటికి చలామణీలో ఉన్న రూ.2000 నోట్లలో 93% నోట్లు బ్యాంకుల్లోకి డిపాజిట్ అయ్యాయి. ఈరోజు వరకు ఎంతో కొంత మొత్తం తిరిగి వచ్చి ఉంటుంది. అంటే, ఆర్థిక వ్యవస్థలో మిగిలే రూ.2 వేల నోట్లు చాలా తక్కువగా ఉంటాయి. అయినా వీటిని మార్చుకునే అవకాశం మరోసారి కల్పించింది ఆర్బీఐ.  


ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో తీసుకొచ్చారు. అంతకుముందే, చలామణిలో ఉన్న మొత్తం రూ.500 & రూ.1000 నోట్ల చట్టబద్ధతను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్‌ను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి. రూ.2 వేల నోట్లను రద్దు చేసిన తరువాత ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త నోట్లు తెస్తుందా, లేక రూ.2 వేల నోట్లను మళ్లీ వేరే తీరుగా ముద్రిస్తుందా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.