Bharat NCAP: ప్యాసింజర్ కార్ల కోసం కేంద్ర సర్కారు కొత్త సేఫ్టీ రేటింగ్ విధానాన్ని తీసుకురానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేటింగ్ విధానం అమలు కానుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(Bharat NCAP) ప్రారంభోత్సవం సందర్భంగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. భారత్ NCAP ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 3.5 టన్నుల వరకు సామర్థ్యం గల మోటారు వాహనాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. మార్కెట్ లో అందుబాటులో ఉన్న కార్లలో అత్యంత సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.
ఈ ప్రోగ్రామ్ కింద కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ASI) 197 ప్రకారం.. కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేయడానికి అందించవచ్చు. దీని ద్వారా వాహనాలు సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. అలా మార్కెట్ లో అందుబాటులో ఉన్న మోటారు వాహనాల క్రాష్ సేఫ్టీని సరిపోల్చుకోవచ్చు, మదింపు చేసుకుని మంచి సేఫ్టీ ఫీచర్లను అందించే వాటినే ఎంచుకోవచ్చు.
'ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇది అత్యంత ప్రాధాన్యతనిచ్చే సమయం. దానికి రహదారి భద్రత అత్యంత ముఖ్యమైన విషయం. రోడ్డు ఇంజినీరింగ్ లో కొన్ని తప్పులు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆ తప్పులేమిటో ఇంజినీర్లకు చెప్పి, వాటిపై అవగాహన కల్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఈ కొత్త కార్యక్రమంతో రోడ్డు ప్రమాద మరణాలను భారీగా తగ్గించవచ్చు' అని భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం సందర్భంగా రోడ్డు, రహదారి భద్రత మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ప్రస్తుత కాలంలో సురక్షితమైన, సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ ఉన్న కార్లను కొనడానికే ఎక్కువ మంది కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నాయి. అయితే దేశీయ కార్లు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గుర్తింపు పొందడానికి భారత్ ఎన్‌సీఏపీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఒక కంపెనీ తమ ఉత్పత్తులను టెస్ట్ చేయడానికి అందించినప్పుడు.. వాటి పని తీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్ కోసం రేటింగ్ అనేది అందిస్తారు. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కార్లు ఎంచుకోవచ్చు. దీని వల్ల అధిక సేఫ్టీని ఇచ్చే కార్లను ఎంచుకోవడం సులువు అవుతుంది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా కంపెనీలు ఈ భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో 2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని గడ్కరీ పిలుపునిచ్చారు.