వెనుకబడిన తరగతుల (OBC) కుల ప్రాతిపదికన జనాభా గణనను కేంద్రం నిర్వహించడం లేదంటూ ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF) మే 25(బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు బహుజన్ ముక్తి పార్టీ(BMP) సహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. వెనుకబడిన కులాల కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినందున భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు బహుజన్ ముక్తి పార్టీ (BMP) సహారన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వంటి సమస్యలను కూడా ఆయన లేవనెత్తారు.
మే 25న జరిగే భారత్ బంద్‌కు BAMCEFతోపాటు, బహుజన్ ముక్తి పార్టీ మద్దతు కూడా లభించింది. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను నాయకులు కోరారు. బహుజన క్రాంతి మోర్చా జాతీయ కన్వీనర్ కూడా ఈనెల 25న జరిగే భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ భారత్ బంద్ ప్రభావం దుకాణాలు, ప్రజా రవాణాపై పడే అవకాశం ఉంది. దీని కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. 25 మే 2022 భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన వర్గాలు... బుధవారం దుకాణాలు మూసి ఉంచాలని సోషల్ మీడియా ద్వారా దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ బంద్ దేని కోసం చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.
1. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిలిపివేయడం.
2. కుల ఆధారిత జనాభా గణన.
3. ప్రైవేట్ రంగంలో SC/ST/OBC రిజర్వేషన్లు.
4. రైతులకు MSP హామీనిచ్చే చట్టం.
5. NRC/CAA/NPR అమలు చేయకపోవడం.
6. పాత పెన్షన్ పథకం పునఃప్రారంభం.
7. ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో పంచాయతీ ఎన్నికల్లో OBCలకు ప్రత్యేక రిజర్వేషన్ కోసం
8. పర్యావరణ పరిరక్షణ ముసుగులో గిరిజన ప్రజలను తరమివేయొద్దని
9. టీకాను తప్పనిసరి చేయొద్దని
10. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో రహస్యంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల నుంచి కార్మికుల రక్షణ కోసం ఉద్యమం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.