అర్ధరాత్రి తమ ఇంటికి తిరిగి వెళ్తున్న భార్యాభర్తలకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వారిని అడ్డుకుని ఎన్నో ప్రశ్నలు వేశారు, ఐడీ కార్డులు చూపించినా జంటను పోలీసులు విడిచిపెట్టలేదు. రాత్రిపూట రోడ్లపై తిరిగినందుకు వారి నుంచి రూ.1000 జరిమానా కట్టించుకునే దాక వదల్లేదు. దీనికి సంబంధించి బాధితుడు సోషల్ మీడియాలో ట్వీట్లు చేయగా, స్పందించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన కర్నాటకలో జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి..
ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రజలు న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసులు ఓ జంటను ఇబ్బందిపెట్టారు. కార్తీక్ పత్రి తన భార్యతో కలిసి గురువారం అర్ధరాత్రి బర్త్ డే వేడుకలకు హాజరయ్యాడు. కేక్ కటింగ్ పూర్తయ్యాక భార్యాభర్తలు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. మరికొన్ని నిమిషాల్లో వారు కమ్యూనిటీ గేట్ నుంచి ఇంటికి చేరుకునేవారు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో పెట్రోలింగ్ పోలీసులు వీరిని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్రించారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ దగర్లో ఫ్రెండ్ బర్త్ డే కేక్ కటింగ్ కు వెళ్లి వస్తున్నామని దంపతులు చెప్పారు.
పేరు వివరాలు అడిగిన పోలీసులు వారి వద్ద ఐడీ కార్డులు ఉన్నాయా అని భార్యాభర్తల్ని ప్రశ్నించినట్లు కార్తీక్ పత్రి వెల్లడించారు. ఐడీ చూసిన పోలీసులు, తమ ఫోన్లను లాగేసుకుని చలానా బుక్ తీసి రాయడం మొదలుపెట్టారని ట్వీట్ లో పేర్కొన్నారు. చలానా ఎందుకు రాస్తున్నారు, మేం తప్పు చేశామో చెప్పండి సార్ అని పోలీసులను సహనం కోల్పోకుండా అడిగారు. చూస్తే చదువుకున్నవాళ్లలా ఉన్నారు. రాత్రి 11 దాటిన తరువాత రోడ్లపై తిరగడం నేరమని తెలియదా అందుకు జరిమానా కట్టాలని రూ.3000 డిమాండ్ చేశారు పోలీసులు.
మేం కేవలం బర్త్ డే పార్టీకి వెళ్లొస్తున్నామని, తాము భార్యాభర్తలమని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. ఇలాంటి రూల్ ఉందని తమకు తెలియదని, ఈ ఒక్కసారి వదిలేయండి సారీ సార్ అన్నారు. ఆ బెంగళూరు పోలీసులు ఇదే ఛాన్స్ అనుకుని వారు కచ్చితంగా చలానా డబ్బులు కట్టి, వెళ్లిపోవాలని గట్టిగా సూచించారు. చివరకు చేసేదేమీ లేక రిక్వెస్ట్ చేసి, రూ.1000 స్కానర్ ద్వారా చెల్లించి ఇంటికి వెళ్లిపోయినట్లు కార్తీక్ పత్రి తెలిపారు. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లకు తెలుపుతూనే మేం చేసింది నేరమా అని బెంగళూరు సిటీ పోలీసులను, బెంగళూరు పోలీస్ కమిషనర్ ను తన ట్వీట్లో ట్యాగ్ చేశారు బాధితుడు.
ఇలాంటి ఘటనను టెర్రరిజం అనరని, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చట్టాలను అతిక్రమించి ఇబ్బందులకు గురి చేస్తే ఎలా, మేం ఇంకెవర్ని నమ్మాలి అని ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు కార్తీక్ పత్రి. బాధితుడి వరుస ట్వీట్లు చూసిన బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆ దంపతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. నార్త్ వెస్ట్ డీసీపీ అనూప్ శెట్టి సైతం బాధితుడి ట్వీట్లపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగితే నేరుగా మెస్సేజ్ చేయాలని సూచించారు. పోలీసులు తన ట్వీట్ కు స్పందించి చర్యలు తీసుకున్నందుకు బాధితుడు కార్తీక్ పత్రి పోలీస్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.