Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ గురువారం రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభలో ఇవాళ ప్రకటన చేశారు దీదీ. ఒక్కొక్కరికీ నెలకు రూ. 40 వేలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జీతంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ.. ఎలాంటి జీతమూ తీసుకోకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ సభ్యుల జీతాలు తక్కువగా ఉన్నాయని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దీదీ తెలిపారు.


తాజాగా తీసుకున్న జీతాల పెంపు నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల జీతాలు రూ. 10 వేల నుంచి రూ. 50 వేలకు పెరగనున్నాయి. అలాగే మంత్రుల జీతాలు రూ. 10,900 నుంచి రూ. 50,900 కి పెరగనున్నాయి. కేబినెట్ మంత్రుల జీతాలు రూ. 11 వేల నుంచి రూ. 51 వేలకు పెరగనున్నాయి. అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు అన్నీ ఈ వేతనానికి అదనం. అవన్నీ కలుపుకుంటే ఒక్కో ఎమ్మెల్యేలకు ఇకపై నెలకు రూ. 1.21 లక్షలు, మంత్రులకు రూ. 1.50 లక్షలు చొప్పున వేతనాలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా డీఏ చెల్లింపులు చేయాలంటూ ఓ వైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.






బెంగాలీ కొత్త సంవత్సరం ఎప్పుడంటే?


పశ్చిమ బెంగాల్ కొత్త సంవత్సరాన్ని పొలై బైసాకీ రోజునే సెలబ్రేట్ చేసుకునేందుకు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే రాష్ట్ర గవర్నర్ ఈ తీర్మానానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, గవర్నర్ ఆమోదించినా, ఆమోదించకపోయినా.. బెంగాలీ కొత్త సంవత్సరాన్ని జూన్ 20వ తేదీన జరుపుకోనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.