Snake In Amazon Package: టెక్నాలజీ పెరిగిపోయింది. ఫుడ్ నుంచి ఇంట్లో వాడే ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. అదీ, ఇదీ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే వస్తున్నాయి. కొన్ని సార్లు డెలివరీలో మోసాలు జరుగుతూ ఉంటాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్లలు, ఇటుకలు వచ్చిన ఘటనలు ఎన్నో చదివే ఉంటాం. కొన్ని సార్లు మనం ఆర్డర్ చేయనివి కూడా డెలివరీ అవుతుంటాయి. కొన్ని సార్లు ఆర్డర్ పెట్టిన వాటితో పాటు మరికొన్ని అదనంగా వస్తుంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఇది ఒక సారి చదవాల్సిందే.


మీరు ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ పెడుతున్నారా? అ‍యితే  జాగ్రత్త ఉండాల్సిందే. గతంలో కొన్ని సార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువులు కాకుండా వేరే వస్తువులు ఇంటికి వచ్చేవి. కానీ తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ జంట సరదాగా ఆడుకోవడానికి ఎక్స్ బాక్స్‌ను ఆర్డర్ చేస్తే బతికున్న పామును సదరు ఆన్ లైన్ సంస్థ ఇంటికి డెలివరీ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. పామును చూసిన నెటిజన్లు తమదైన శైలిలో పంచ్‌లు, జోకులు పేల్చుతున్నారు. 


బెంగళూరులోని సర్జాపూర్‌కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కోసం వీడియోగేమ్‌ ఆడుకునే ఎక్స్‌బాక్స్‌ను ఇటీవల అమెజాన్‌ యాప్‌లో ఆర్డర్‌ చేశారు. సమయానికే ఆర్డర్ డెలివరీ అయ్యింది. తాము ఆర్డర్ చేసిన వస్తువు ఎలా ఉందో చూద్దామని పార్సిల్ ఓపెన్ చేసి చూసి బిత్తరపోయారు. బాక్స్‌లో ఓ పాము బుసలు కొడుతూ కనిపించింది. ప్యాకేజింగ్ టేప్‌కు పాము అతుక్కుపోయి కదలేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో సదరు ఐటీ జంట తమకు జరిగిన అనుభవాన్ని అంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.






తమకు జరిగిన అనుభవాన్ని బాధితులు డెలివరీ సంస్థ అమెజాన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కంపెనీ ప్రతినిధులు తమను 2 గంటల పాటు లైన్‌లో వేచి ఉండేలా చేశారని వాపోయారు. అయితే ఎట్టకేలకు అమెజాన్ కంపెనీ స్పందించింది. అమెజాన్ ఆర్డర్‌తో జరిగి అసౌకర్యానికి క్షమించాలని కోరింది. ఆర్డర్‌లో పాము రావడంపై పూర్తి స్థాయి వివరణ ఇస్తామని ట్విటర్ వేదికగా తెలిపింది. అలాగే వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని కూడా రిఫండ్ చేసింది.