Bagumati Express Collided With Freight Train In Chennai: తమిళనాడులోని చెన్నై (Chennai) శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ - దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) (Bagumathi Express) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు భోగీలు దగ్ధమయ్యాయి. నాలుగు ఏసీ భోగీలు పట్టాలు తప్పాయి. దాదాపు 20 మందికి గాయాలైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్ర్‌ప్రెస్ అతివేగంతో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంతో చెన్నై సెంట్రల్ నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌తో సహా కొన్ని రైళ్లు రద్దు చేశారు. నెల్లూరు - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.










అధికారులు అంబులెన్సులు, రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సేఫ్‌గా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు వంటి మౌలిక వసతులు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తిరువళ్లూరు అధికారులు తెలిపారు.


అదే కారణమా.?




మైసూర్ - దర్బంగా రైలుకు శుక్రవారం రాత్రి 8:27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన తర్వాత కవరైపెట్టై స్టేషన్‌లో మెయిన్ లైన్‌లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, రైలు ఆ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు. మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు.. లూప్ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 భోగీల్లో మంటలు చెలరేగాయి. మొత్తం 6 భోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనా స్థలంలో రైల్వే అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నై రైల్వే డివిజన్ అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు 04425354151, 04424354995 ఏర్పాటు చేశారు.


Also Read: AIR India Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్