రైల్వే అధికారులు చంటి పాపల తల్లలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఢిల్లీ డివిజన్ల సమన్వయంతో లఖ్ నవూ మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లోని త్రీ టైర్ బీ4 కోచ్ లో బేబీ బెర్త్ లను ఫైలెట్ ప్రాజెక్టు గా ఏర్పాటు చేశారు. చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్ ‘బేబీ బెర్త్’. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి బెర్త్ ఇది. లోయర్ బెర్త్ కు అటాచ్ అయ్యి ఉంటుంది.
ట్రైన్ లో ప్రయాణించే సమయంలో చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఈ బెర్త్ పై తమ చిన్నారులను పడుకోబెట్టుకోవచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్ పై తల్లీబిడ్డ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్థలం సరిపడక, ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు బేబీ బెర్త్ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టుకోవచ్చు. ప్రయాణం చేస్తున్న సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని సిద్ధం చేశారు.
ఇక్కడ ఫలితాలు బాగుంటే ఆ తర్వాత ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించే అవకాశం ఉంది. బేబీ బెర్త్ అవసరం లేనప్పుడు దీన్ని లోయర్ బెర్త్ కిందకు మడతపెట్టొచ్చు అని రైల్వేశాఖ ప్రకటించింది. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్ కు చిన్నారులను సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలు కూడా ఉన్నాయి.
భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటి పిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లీబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కారం చూపలేకపోయారు. అయితే తొలిసారిగా నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు.